మే 2న.. నేను చెప్పిందే నిజమవుతుంది: పీకే

పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికలను ప్రజాస్వామ్య పోరుగా అభివర్ణించారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన

Published : 27 Feb 2021 14:37 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికలను ప్రజాస్వామ్య పోరుగా అభివర్ణించారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘నేను గత ట్వీట్‌లో చెప్పింది మే 2వ తేదీన నిజమవుతుంది’’ అంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయంపై మరోసారి ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

‘‘దేశంలో ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న కీలక పోరాటాల్లో ఒకటి పశ్చిమ బెంగాల్‌లో జరగనుంది. బెంగాల్‌ ప్రజలు వారి తీర్పుతో సిద్ధంగా ఉన్నారు. బెంగాల్‌కు తమ సొంత కుమార్తె మాత్రమే కావాలని(తృణమూల్‌ ప్రచార నినాదం) నిశ్చయించుకున్నారు. గుర్తుంచుకోండి: మే 2వ తేదీన.. నా చివరి ట్వీట్‌లో చెప్పిందే నిజమవునుంది’’అని పీకే ట్విటర్‌లో రాసుకొచ్చారు. 

ఈ ఏడాదిలో ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన తొలి ట్వీట్ ఇదే. చివరిసారిగా డిసెంబరు 21న బెంగాల్‌ ఎన్నికలపై ట్విటర్‌లో స్పందించిన ఆయన.. భాజపాకు ఓ సవాల్‌ విసిరారు. ‘‘భాజపా అనుకూల మీడియా మాత్రమే ఆ పార్టీకి మద్దతుగా చెబుతోంది. కానీ వాస్తవానికి బెంగాల్‌లో  భాజపా రెండంకెలను మించి సీట్లు సాధించలేదు. నా అంచనా తప్పితే ఈ సామాజిక మాధ్యమ వేదిక నుంచి శాశ్వతంగా తప్పుకుంటా’’ అని పీకే అప్పట్లో ట్వీట్ చేశారు. ప్రశాంత్‌కు చెందిన ఐ-ప్యాక్‌ కన్సల్టెన్సీ ఈ ఎన్నికల్లో తృణమూల్‌ తరఫున పనిచేస్తోన్న విషయం తెలిసిందే. 

294 సీట్లున్న పశ్చిమ బెంగాల్‌లో మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 29 వరకు మొత్తం ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడించనున్నారు. గత రెండు ఎన్నికల్లో విజయం సాధించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈ సారి హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తోంది. అయితే ఎన్నికలకు ముందు కీలక నేతలు పార్టీ వీడటం తృణమూల్‌కు తలనొప్పిగా మారింది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన భాజపా.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి రాష్ట్రంలో పాగా వేయాలని వ్యూహాలు రచిస్తోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని