Prashant Kishor: నీతీశ్‌ అందుకే భాజపాను వీడారు..!

బిహార్‌లో (Bihar Politics) చోటుచేసుకున్న తాజా పరిణామాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) స్పందించారు.

Published : 11 Aug 2022 01:41 IST

బిహార్‌ పరిణామాలపై స్పందించిన ప్రశాంత్‌ కిశోర్‌

పట్నా: ఎన్డీఏ కూటమితో ఐదేళ్ల బంధం తెంచుకున్న జేడీ(యు) నేత నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar).. ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. అనంతరం మహాకూటమి మద్దతుతో మరోసారి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇలా బిహార్‌లో (Bihar Politics) చోటుచేసుకున్న తాజా పరిణామాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) స్పందించారు. భాజపా కూటమిలో నీతీశ్‌ కుమార్‌ సౌకర్యవంతంగా లేనందునే బయటకు వచ్చి ప్రత్యర్థి కూటమిలో చేరిపోయినట్లు వెల్లడించారు. అయితే, ఈ పరిణామాలు రాష్ట్రానికే పరిమితమన్న ఆయన.. జాతీయ స్థాయిలో ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

‘2017 నుంచి 2022 వరకు నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) భాజపాతో కలిసి ఉన్నారు. కాన్నీ, ఎన్నడూ అక్కడ సంతోషంగా ఉన్నట్లు కనిపించలేదు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. అందుకే మహాకూటమితో (Grand Alliance) ప్రయోగం చేద్దామని భావించి ఉండవచ్చు’ అని ఓ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు. ఇక ప్రధాని పీఠంపై నీతీశ్‌ కుమార్‌ గురిపెట్టారని వస్తోన్న వార్తలపై స్పందించిన ఆయన.. ప్రస్తుత పరిణామాలు కేవలం బిహార్‌కే పరిమితమని అన్నారు.

‘ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి 2012-13 నుంచి ప్రయోగం చేయడం ఇది ఆరోసారి. ఈ ఆరుసార్లు కూడా నీతీశ్‌ కుమార్‌ మాత్రమే ముఖ్యమంత్రి. అయినప్పటికీ బిహార్‌ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. కనీసం ఈ కొత్త ప్రభుత్వమైనా కొంత మంచి చేస్తుందని ఆశిస్తున్నా’ అని ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు. అవినీతితోపాటు చాలా అంశాల్లో భిన్నాభిప్రాయాలున్న ఆర్జేడీ, జేడీ(యు)లు ఎటువంటి పాలన చేస్తాయో చూడాలన్నారు.

ఇదిలాఉంటే, ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహా కూటమిలో చేరిన నీతీశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ఫాగు చౌహన్‌.. నీతీశ్‌ చేత ప్రమాణం చేయించారు. బిహార్‌ సీఎంగా నీతీశ్‌ బాధ్యతలు చేపట్టడం ఇది 8వ సారి కాగా.. కూటమిలోని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ బిహార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని