Rahul Gandhi : సరికొత్త పార్లమెంట్‌ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలి: రాహుల్‌గాంధీ

సరికొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవంపై వివాదం మొదలైంది. దీనిని ప్రధాని కాకుండా రాష్ట్రపతి ప్రారంభించాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు.  

Updated : 21 May 2023 16:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశరాజధానిలో సరికొత్తగా నిర్మించిన పార్లమెంట్‌ భవనం(new Parliament building) ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వెలువడుతున్నాయి. ఆదివారం దీనిపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈ సరికొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని(PM Modi)తో కాకుండా రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. మార్చి 28న ఈ భవన ప్రారంభోత్సవం జరగాల్సిన నేపథ్యంలో రాహుల్‌ నుంచి ఈ డిమాండ్‌ వచ్చింది. ‘‘సరికొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం రాష్ట్రపతి చేయాలి. ప్రధాని కాదు’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

ఈ నెల 18వ తేదీన సరికొత్త పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవంపై లోక్‌సభ సెక్రటేరియట్‌ ఓ ప్రకటన చేసింది. స్పీకర్‌ ఓంబిర్లా ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయినట్లు దానిలో పేర్కొన్నారు. ఆయన్ను పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్లు  వెల్లడించారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. ప్రధాని ప్రభుత్వానికి అధినేతకానీ, చట్టసభకు కాదని పేర్కొన్నారు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ట్విటర్‌ వేదికగా దీనిపై స్పందిస్తూ.. ‘‘ప్రధాని పార్లమెంట్‌ను ఎందుకు ప్రారంభిస్తారు..? ఆయన కార్యనిర్వాహక వర్గానికి అధిపతి. చట్టసభకు కాదు. మనకు అధికారాల విభజన జరిగింది. గౌరవ లోక్‌సభ స్పీకర్‌ లేదా రాజ్యసభ ఛైర్మన్‌ కానీ ప్రారంభించవచ్చు. దానిని ప్రజాధనంతో నిర్మించారు. అదేదో తన మిత్రులు ఇచ్చిన ప్రైవేటు ఫండ్స్‌తో నిర్మించినట్లు మోదీ ప్రవర్తిస్తున్నారు’’ అని విమర్శించారు.

భారత నూతన పార్లమెంట్‌ను 64,500 చదరపు మీటర్ల వైశాల్యంలో నాలుగు అంతస్తుల భవనంగా నిర్మించారు. దీని నిర్మాణానికి 2020 డిసెంబర్‌ 10న శంకుస్థాపన చేశారు. ఈ భవనంలో ఉభయ సభల సంయుక్త సమావేశ సమయంలో 1,280 మంది సభ్యుల సీటింగ్‌కు ఏర్పాట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని