Karnataka Elections: హ్యాట్రిక్‌ విజయాల వీరుడు.. జోరు మీదున్న ప్రియాంక్‌ ఖర్గే

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్‌ ఖర్గే (Priyank kharge) వరుసగా మూడోసారి విజయం సాధించారు. చిత్తాపుర్‌ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిపై 13,640 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Published : 13 May 2023 22:11 IST

చిత్తాపుర్‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయదుందుభి మోగించింది. మొత్తం 224 స్థానాలకు గానూ 136 నియోజకవర్గాలను కైవసం చేసుకొని ఏ పార్టీ మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్‌ ఖర్గే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. చిత్తాపుర్‌ నియోజకవర్గం నుంచి వరుసగా మూడో సారి విజయం సాధించి రికార్డు సృష్టించారు. సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి మణికంఠ రాథోడ్‌పై 13,640 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2013, 2018 ఎన్నికల్లోనూ ఈ స్థానం నుంచి ప్రియాంక్‌ ఖర్గే విజయం సాధించారు.

ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్‌ చేసిన చిత్తాపుర్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట. గత కొన్నేళ్ల నుంచి హస్తం పార్టీ అభ్యర్థులే ఇక్కడ పైచేయి సాధిస్తున్నారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తాపుర్‌ నుంచి ప్రస్తుత కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు. కానీ, 2009 సాధారణ ఎన్నికల్లో ఆయన పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికవ్వడంతో..ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఉపఎన్నికల్లో ఆయన తనయుడు ప్రియాంక్‌ ఖర్గే తొలిసారి పోటీ చేశారు. కానీ, భాజపా అభ్యర్థి వాల్మీకి నాయక్‌ చేతిలో 2 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.  ఆ తర్వాత 2013 ఎన్నికల్లో 30 వేలు, 2018 ఎన్నికల్లో 4,393 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

కర్ణాటక ఎన్నికల ప్రచారం సమయంలో ప్రధాని మోదీపై ప్రియాంక్‌ ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ ప్రియాంక్‌ ఖర్గేకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అయితే, బంజారా సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు ప్రధాని మోదీ రిక్త హస్తాలు చూపించారని చెప్పే క్రమంలోనే తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని ప్రియాంక్‌ ఖర్గే వివరణ ఇచ్చారు. మరోవైపు ప్రియాంక్‌ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు భాజపా తీవ్ర ప్రయత్నాలు చేసింది. కాంగ్రెస్‌ వ్యక్తిగత విమర్శలు చేస్తోందని ప్రజల్లోకి తీసుకెళ్లింది. కానీ, చిత్తాపుర్‌ ప్రజలు మాత్రం ప్రియాంక్ ఖర్గేకే వరుసగా మూడోసారి జై కొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని