Congress: కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీని నియమించాలని ప్రతిపాదన!

కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీని నియమించాలంటూ సీనియర్‌ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణమ్‌ ప్రతిపాదన తీసుకొచ్చారు........

Published : 15 May 2022 01:51 IST

ఉదయ్‌పూర్‌: పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కొనసాగుతున్న నవ సంకల్ప చింతన్‌ శిబిర్‌లో పలు కీలక ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. సాధికారితే ప్రధాన లక్ష్యంగా పార్టీ నేతలు చర్చలు జరపగా.. కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీని నియమించాలంటూ సీనియర్‌ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణమ్‌ ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రియాంక గాంధీ అత్యంత ప్రజాదరణ పొందుతున్నారు గనక ఆమెను అధ్యక్షురాలిగా నియమించాలని కోరారు. ‘రెండేళ్లుగా రాహుల్ గాంధీని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన సిద్ధంగా లేకుంటే, ప్రియాంక గాంధీ వాద్రాను పార్టీ అధ్యక్షురాలిగా నియమించాలి’ అని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో ప్రమోద్‌ కృష్ణమ్ పేర్కొన్నారు. అయితే వారిద్దరూ స్పందించకపోవడంతో ఎంపీ మల్లికార్జున్ ఖర్గే ఆయన్ను అడ్డుకున్నారు. ప్రమోద్ కృష్ణమ్‌ మాత్రమే కాదు.. ఎంపీ దీపేందర్‌ హుడా సైతం ఇదే ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ చర్చలో భాగంగా పార్టీ గుజరాత్‌ ఇన్‌ఛార్జ్‌ రఘు శర్మ మాట్లాడుతూ.. పార్టీలో మార్పులు జరగకపోతే మరింత బలహీనపడుతుందని అభిప్రాయపడ్డారు. మరికొద్ది నెలల్లో గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించకపోతే.. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆశలు వదులుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. 

పార్టీలోని అన్ని పదవుల్లో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనార్టీలకు ప్రాతినిధ్యాన్ని 50శాతానికి పెంచాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. సామాజిక న్యాయం, సాధికారితపై పార్టీ నేతలు శనివారం చర్చించగా ఆ వివరాలను పార్టీ నేత కె. రాజు మీడియాకు తెలిపారు. పార్టీలో సామాజిక న్యాయం సాధించే దిశగా సంస్థాగత సంస్కరణలను తీసుకురావాలని హైకమాండ్‌ భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీలోని అన్ని స్థాయిల్లో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనార్టీల ప్రాతినిధ్యాన్ని 50 శాతానికి పెంచాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనలను వర్కింగ్‌ కమిటీ ఆమోదిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని