Priyanka Gandhi: ప్రధానిజీ.. అసలు మీ ఉద్దేశం ఏంటి..?

లాక్‌డౌన్ సమయంలో వలసకూలీలకు ఉచితంగా రైలు టికెట్లు ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ కొవిడ్ వ్యాప్తికి కారణమయ్యిందంటూ ప్రధాని మోదీ చేసిన విమర్శలను.. హస్తం పార్టీ తీవ్రంగా ఖండించింది.

Published : 08 Feb 2022 12:41 IST

రెండోదశలో మీరు నిర్వహించిన ర్యాలీల మాటేంటి..?

దిల్లీ: లాక్‌డౌన్ సమయంలో వలసకూలీలకు ఉచితంగా రైలు టికెట్లు ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ కొవిడ్ వ్యాప్తికి కారణమయ్యిందంటూ ప్రధాని మోదీ చేసిన విమర్శలను.. హస్తం పార్టీ తీవ్రంగా ఖండించింది. రెండోదశ వేళ ప్రధాని చేపట్టిన ఎన్నికల ర్యాలీల సంగతేంటంటూ దీటుగా ప్రశ్నించింది. గోవా రాజధాని పనాజీలో ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్‌లో ప్రధాని చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చారు.

‘కరోనా సమయంలో ప్రధాని వలసకూలీలను పట్టించుకోకుండా వదిలేస్తే.. వారికి ఇంటికి వెళ్లడానికి మార్గం కూడా లేదు. కాలి నడకనే వారు ఇంటికి పయనమయ్యారు. వారికి ఎవరూ సహాయం చేయకూడదని ఆయన కోరుకున్నారా? ఆయనకు ఏం కావాలి? కరోనా సమయంలో ఆయన నిర్వహించిన భారీ ర్యాలీల మాటేంటి?’ అంటూ తీవ్రంగా  విమర్శించారు. ‘ప్రధాని ఆరోపణల్ని నేను ఖండిస్తున్నాను. దీనిపై దిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. ఆ సమయంలో ప్రజలు ఇబ్బందిలో ఉన్నారు. వారికి తినడానికి తిండి, నీళ్లు, బట్టలు లేవు. వారికి సహాయం చేయడం తప్పా? మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరులను నిందించడం సరికాదు’ అంటూ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. గతేడాది పలు రాష్ట్రాలకు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అప్పటికే కేసులు పెరుగుతున్నా.. పార్టీలు ప్రచారాన్ని కొనసాగించాయి. అనంతరం కరోనా రికార్డు స్థాయిలో విజృంభించి.. భారత్‌ను వణికించింది.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ... ప్రధాని మోదీ సోమవారం లోక్‌సభలో మాట్లాడారు. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. కరోనా కాలంలో ఆ పార్టీ హద్దులన్నీ దాటిందన్నారు. ‘కరోనా తొలిదశలో దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. ఎక్కడివారు అక్కడే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వైద్య నిపుణులు చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు మాత్రం ముంబయి రైల్వేస్టేషన్‌ ముందు నిలబడి వలస కార్మికులకు ఉచిత టికెట్లు ఇచ్చారు. స్వస్థలాలకు వెళ్లిపోండని రెచ్చగొట్టారు. కొవిడ్‌ వ్యాప్తికి కారణమయ్యారు’ అంటూ దుయ్యబట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని