Priyanka Gandhi: వయనాడ్‌ను వదులుకోనున్న రాహుల్‌.. ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ..?

Priyanka Gandhi: కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాహుల్‌ గెలిచిన వయనాడ్‌ స్థానం నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

Published : 14 Jun 2024 10:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ జయకేతనం ఎగురవేశారు. దీంతో వయనాడ్‌ (కేరళ), రాయ్‌బరేలీ (యూపీ) స్థానాల్లో ఒక నియోజకవర్గాన్ని ఆయన వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై తాను ఎటూ తేల్చుకోలేకపోతున్నానంటూ ఇటీవల రాహుల్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, తన నిర్ణయం రెండు వర్గాల ప్రజలను సంతోషపరుస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే వయనాడ్‌ (Wayanad) స్థానాన్ని ఆయన వదులుకోనున్నట్లు ప్రచారం జోరందుకొంది. అంతేకాదు.. ఇక్కడి నుంచే ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) ఎన్నికల అరంగేట్రం చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

రాహుల్‌ గాంధీ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ వయనాడ్‌ స్థానం ఖాళీ కావొచ్చని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కె. సుధాకరన్‌ ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించారు. ‘‘ఈ దేశానికి నాయకత్వం వహించాల్సిన రాహుల్‌ గాంధీ వయనాడ్‌కు మాత్రమే పరిమితం కావాలని మేం అనుకోవట్లేదు. అందుకే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా బాధపడం. ఆయన నిర్ణయాన్ని అర్థం చేసుకోగలం. ఆయనకు ఎప్పటికీ అండగా ఉంటాం’’ అంటూ పీసీసీ చీఫ్‌ వ్యాఖ్యానించారు. దీంతో రాహుల్‌ ఈ స్థానాన్ని వదులకుని కాంగ్రెస్‌ (Congress) కంచుకోట రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగుతారని ఊహాగానాలు మొదలయ్యాయి.

అదే జరిగితే వయనాడ్‌ స్థానానికి ఉప ఎన్నిక (Wayanad By Poll) అనివార్యమవుతుంది. అప్పుడు ప్రియాంక గాంధీ వాద్రా ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. తన సోదరిని ఆశీర్వదించాలని రాహుల్‌ వయనాడ్‌ ప్రజలను కోరనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అరంగేట్రంపై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఆమె అమేఠీ లేదా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. దీనిపై సుదీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీ చేసి విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల్లో విస్తృత ప్రచారంపై దృష్టి సారించేందుకే ఆమె పోటీకి దూరమైనట్లు ఇటీవల కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. అయితే, ఎక్కడైనా ఉప ఎన్నిక ద్వారా ఆమె పార్లమెంటుకు వెళ్లవచ్చని అన్నారు. దీంతో వయనాడ్‌ ఉప ఎన్నిక నుంచే ఆమె పోటీ ఉంటుందని బలంగా వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని