UP Polls: ప్రియాంక మరో హామీ.. ₹10లక్షల వరకు వైద్య చికిత్స ఉచితం!

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. ప్రజల్ని తమవైపు ఆకర్షించేందుకు రకరకాల హామీలు గుప్పిస్తున్నాయి. యూపీలో......

Published : 25 Oct 2021 16:04 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. ప్రజల్ని తమవైపు ఆకర్షించేందుకు రకరకాల హామీలు గుప్పిస్తున్నాయి. యూపీలో తమ పార్టీకి ఓటువేసి గెలిపిస్తే విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్లు, ఈ-స్కూటర్లు  ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ యూపీ ప్రజలకు మరో కీలక హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తమ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ప్రజలందరికీ రూ.10లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.  ఈ మేరకు ఆమె సోమవారం ట్వీట్‌ చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు నాణ్యమైన, చౌకగా వైద్య చికిత్స అందించే అంశాన్ని తమ మేనిఫెస్టోలో పెట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు.  కరోనా సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ ఎంత దుర్భరంగా ఉందో అంతా చూశామన్నారు. ఇప్పుడు జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొన్నారు. తమ పార్టీని గెలిపిస్తే ఏ వ్యాధికైనా రూ.10లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. 

మరోవైపు శనివారం బారబంకి జిల్లాలో ప్రతిజ్ఞ యాత్రలు ప్రారంభించిన ప్రియాంక గాంధీ ప్రధానంగా ఏడు హామీలు ప్రకటించారు. రైతులకు రుణాలు మాఫీ చేయడంతో పాటు రాష్ట్రంలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.  అలాగే, గోధుమ, వరి పంటలకు క్వింటాల్‌కు రూ.2500లు, క్వింటాల్‌ చెరకుకు రూ.400ల చొప్పున కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ విద్యుత్‌ బిల్లులు సగానికి తగ్గించడం, కరోనా సమయంలో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న కుటుంబాలకు రూ.25వేలు చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో 40శాతం మంది మహిళలకు పార్టీ టికెట్లు ఇవ్వడంతో పాటు 12వ తరగతి పాసైన విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్లు, గ్రాడ్యుయేషన్‌ చదువుతున్న విద్యార్థినులకు ఈ-స్కూటర్లు ఇవ్వనున్నట్టు ఆమె హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని