ప్రజలు ఏడుస్తుంటే.. ర్యాలీలా?

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, ప్రణాళిక లోపం వల్లే దేశంలో ఆక్సిజన్‌, కొవిడ్‌ టీకాలు, రెమ్‌డెసివిర్‌ కొరత ఏర్పడిందని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. కరోనా

Updated : 21 Apr 2021 14:50 IST

కేంద్రంపై ప్రియాంక గాంధీ ధ్వజం

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, ప్రణాళిక లోపం వల్లే దేశంలో ఆక్సిజన్‌, కొవిడ్‌ టీకాలు, రెమ్‌డెసివిర్‌ కొరత ఏర్పడిందని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. కరోనా మహమ్మారి ఉద్ధృతితో పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉందని ఆమె మండిపడ్డారు. మందులు, ఆసుపత్రులు అందుబాటులో లేక ప్రజలు ఏడుస్తుంటే.. కేంద్ర నాయకులు మాత్రం ఎన్నికల ప్రచార సభల్లో నవ్వుతూ కన్పిస్తున్నారని దుయ్యబట్టారు. 

దేశంలో కరోనా పరిస్థితులపై ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్ఐతో ప్రియాంక మాట్లాడారు. ‘‘ఆక్సిజన్‌ లేక, ఆసుపత్రుల్లో పడకలు దొరకక, మందులు అందక ప్రజలు ఏడుస్తున్నారు. సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ వారు(భాజపా నేతలు) ఇప్పుడు కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. పెద్ద పెద్ద ర్యాలీలు పెట్టి నవ్వుతూ మాట్లాడుతున్నారు. అలా ఎలా చేయగలుగుతున్నారు?’’ అని ఆమె ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యం కంటే ఎక్కువగా అధికారంపైనే కేంద్రం దృష్టిపెట్టిందని, అందుకే దేశంలో కరోనా విజృంభణ తారాస్థాయికి చేరుతోందని ఆరోపించారు. 

కేంద్రం ప్రణాళిక లేమి వల్లే దేశంలో ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ కొరత ఏర్పడిందని ప్రియాంక దుయ్యబట్టారు. ‘‘గత 3 నెలల్లో భారత్‌ నుంచి 6 కోట్ల కొవిడ్‌ టీకాలు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. జనవరి-మార్చి మధ్య దేశంలో కేవలం 3-4కోట్ల మందికే టీకాలు ఇచ్చారు. గత 6 నెలల్లో 1.1 మిలియన్ల రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను ఎగుమతి చేశారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యంలో ప్రపంచంలోనే భారత్‌ది అగ్రస్థానం. ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ కొరత ఎదుర్కొంటున్నాం. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యూహం లేకపోవడం వల్లే ఇలా జరిగింది. రెండో దశ రాబోతోందని తెలిసినప్పుడే అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడంలో కేంద్రం విఫలమైంది’’అని ఆమె ధ్వజమెత్తారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని