నిర్మల వ్యాఖ్యలను తప్పుబట్టిన ప్రియాంక.. ఎన్నికల వేళ ఇరుకున పెడుతూ విమర్శలు!

UP Election 2022 | త్వరలో ఎన్నికలు జరగనున్న యూపీలో భాజపాను ఇరుకున పెడుతూ ప్రియాంక విమర్శలు చేశారు. 

Published : 03 Feb 2022 02:32 IST

లఖ్‌నవూ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఉద్దేశించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. తన విమర్శల్లో నిర్మలా సీతారామన్‌ ‘యూపీ-టైప్‌’ అనే పదాన్ని వాడడాన్ని ఆక్షేపించారు. యూపీ ప్రజల మాండలికాన్ని, సంస్కృతిని అవమానించాల్సిన అవసరం లేదని దుయ్యబట్టారు. యూపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ భాజపాను ఇరుకున పెడుతూ ప్రియాంక విమర్శలు చేశారు.

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను సున్నా బడ్జెట్‌గా అభివర్ణిస్తూ రాహుల్‌గాంధీ ట్విటర్‌ వేదికగా మంగళవారం విమర్శలు గుప్పించారు. దీనిపై యూపీకి చెందిన ఎంపీ, కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌ ఛౌదరి స్పందిస్తూ.. ‘బహుశా రాహుల్‌ గాంధీకి బడ్జెట్‌ అర్థం కాలేదనుకుంటా’ అంటూ వ్యాఖ్యానించారు. ఛౌదరి వ్యాఖ్యలను ఉటంకిస్తూ నిర్మలా సీతారామన్‌ సైతం రాహుల్‌పై విమర్శలు చేశారు. యూపీ నుంచి పారిపోయిన (రాహుల్‌నుద్దేశించి) ఓ ఎంపీకి యూపీ-తరహాలో చౌధరి ఇచ్చిన సమాధానం సరిపోతుందనుకుంటా అని వ్యాఖ్యానించారు.

నిర్మల చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘నిర్మలాజీ! మీ బడ్జెట్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌కు ఏమీ ఇవ్వలేదు. అయినా పర్వాలేదు. కానీ, ఇక్కడి ప్రజలను అవమానించాల్సిన అవసరం లేదు. యూపీ భాష, మాండలిక, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర గురించి మేం గర్విస్తున్నాం. ఇక్కడి ప్రజలు కూడా యూపీ-టైప్‌లో ఉండడాన్ని గర్వంగా భావిస్తుంటారన్న విషయాన్ని అర్థం చేసుకోండి’’ అంటూ ప్రియాంక విమర్శలు గుప్పించారు.

సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ అశుతోష్‌ సిన్హా సైతం ప్రియాంకతో గొంతు కలిపారు. నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సరికావని, ఆమె సంకుచిత మనస్తత్వానికి ఆమె వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని విమర్శించారు. రాస్త్రీయ కిసాన్‌ మంచ్‌ అధ్యక్షుడు శేఖర్‌ దీక్షిత్‌ సైతం విమర్శలుచేశారు. దేశానికి ఎందరో ప్రధానులను అందించిన యూపీ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఎన్నికల వేళ ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతూ రాష్ట్ర ప్రజలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని