Priyanka Gandhi: వయనాడ్‌ బరిలో ప్రియాంకా గాంధీ

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారు. రాహుల్‌ గాంధీ ఖాళీ చేయబోయే కేరళలోని వయనాడ్‌ స్థానం నుంచి ఆమె లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి గెలిచిన రాహుల్‌.. కీలకమైన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలోనే కొనసాగనున్నారు.

Published : 18 Jun 2024 06:36 IST

తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి
రాయ్‌బరేలీనే ఎంచుకున్న రాహుల్‌
కాంగ్రెస్‌ సమావేశంలో నిర్ణయం

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారు. రాహుల్‌ గాంధీ ఖాళీ చేయబోయే కేరళలోని వయనాడ్‌ స్థానం నుంచి ఆమె లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి గెలిచిన రాహుల్‌.. కీలకమైన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలోనే కొనసాగనున్నారు. కేరళలోని వయనాడ్‌ను వదులుకోనున్నారు. ఈ స్థానం నుంచి ఉప ఎన్నికలో ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారు. రాహుల్‌ సీటుపై సోమవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన పార్టీ సీనియర్‌ నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో సోనియా, రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్‌ పాల్గొన్నారు. సమావేశానంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. రాహుల్‌ ఖాళీ చేస్తున్న వయనాడ్‌ నుంచి ప్రియాంకను బరిలోకి దించాలని నిర్ణయించామని తెలిపారు. ‘రాహుల్‌ రెండు చోట్ల నుంచి గెలిచారు. చట్టం ప్రకారం.. ఒక సీటును ఆయన వదులుకోవాలి. రాయ్‌ బరేలీ ఎంచుకుని వయనాడ్‌ను వదులుకోవాలని సమావేశంలో నిర్ణయించాం. అక్కడి నుంచి ప్రియాంక పోటీ చేస్తారు’ అని ఖర్గే వెల్లడించారు. రాహుల్‌ గాంధీ మంగళవారంలోగా ఏదో ఒక సీటును వదులుకోవాల్సి ఉంది. దీంతో సోమవారమే నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నేత పదవిని రాహుల్‌కు అప్పగించడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఖర్గే తెలిపారు.

  • వయనాడ్‌ నుంచి ప్రియాంక ఎన్నికైతే తొలిసారిగా పార్లమెంటులోకి ఆమె అడుగుపెడతారు.
  • ఆమె ఎన్నికల్లో గెలిస్తే ముగ్గురు గాంధీలు ఒకే సమయంలో పార్లమెంటులో ఉన్నట్లవుతుంది (సోనియా, రాహుల్, ప్రియాంక).
  • వయనాడ్‌లో రాహుల్‌ గాంధీ 64.7శాతం ఓట్లు సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి, సీపీఐకి చెందిన అన్నీ రాజాపై 3.64 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ భాజపా అభ్యర్థి సురేంద్రన్‌కు 1.3 లక్షల ఓట్లు వచ్చాయి.

వయనాడ్‌కు వస్తూనే ఉంటా: రాహుల్‌

రాయ్‌బరేలీ, వయనాడ్‌లతో తనకు భావోద్వేగ బంధం ఉందని రాహుల్‌ గాంధీ తెలిపారు. ‘గత ఐదేళ్లలో వయనాడ్‌ ఎంపీగా అద్భుతమైన అనుభవాలను సంపాదించా. ఇక్కడి ప్రజలు క్లిష్ట సమయాల్లో నాకు మద్దతుగా నిలిచారు. పోరాడే శక్తినిచ్చారు. దానిని ఎన్నటికీ మరిచిపోను. వయనాడ్‌ను సందర్శిస్తూనే ఉంటా’ అని రాహుల్‌ వివరించారు. 

కష్టపడి వయనాడ్‌లోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేలా చూసుకుంటానని ప్రియాంకా గాంధీ తెలిపారు. రాహుల్‌ ప్రాతినిధ్యం లేదన్న అంశాన్ని ప్రజలు మరిచిపోయేలా పని చేస్తానన్నారు. రాయ్‌బరేలీతో తనకు 20ఏళ్ల బంధం ఉందని, అది ఎన్నటికీ చెరిగిపోదని తెలిపారు. 

దక్షిణాది నుంచి మూడో గాంధీ

1972 జనవరి 12న జన్మించిన 52 ఏళ్ల ప్రియాంకా గాంధీ 1997లో రాబర్ట్‌ వాద్రాను వివాహమాడారు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2019 జనవరి 23న పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అంతవరకు ఆమె పరోక్షంగా కుటుంబ సభ్యులకు రాజకీయ ప్రచారం చేస్తూ వస్తున్నప్పటికీ అధికారికంగా పార్టీ బాధ్యతలు చేపట్టడం అదే తొలిసారి. తొలుత తూర్పు ఉత్తర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఉత్తర్‌ ప్రదేశ్‌కు పూర్తి ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో ఆమె విస్తృతంగా పర్యటించి, ప్రచారం చేసినా కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ సీట్లు, ఓట్లు రాలేదు. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా నిరంతరం యూపీలో ప్రజా సమస్యలపై ఆందోళనలు, ఉద్యమాలు చేస్తూ వచ్చారు. దాని ఫలితంగానే తాజా ఎన్నికల్లో ఇండియా కూటమి ఎన్డీయే కంటే అధిక సీట్లు దక్కించుకోగలిగింది. వయనాడ్‌లో ఆమె గెలిస్తే దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించిన గాంధీ కుటుంబంలోని మూడో వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. ఇదివరకు ఇందిరా గాంధీ, రాహుల్‌ గాంధీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. మరోవైపు కాంగ్రెస్‌.. పార్టీ కాదని, అది ఒక కుటుంబ కంపెనీ అని భాజపా వ్యాఖ్యానించింది. వారసత్వ రాజకీయాలకు ఇది రుజువని విమర్శించింది. వయనాడ్‌ నుంచి ప్రియాంకను బరిలోకి దింపాలని అధిష్ఠానం నిర్ణయించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ కేరళ విభాగం స్వాగతించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని