
Priyanka Gandhi: నన్ను చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?
లఖ్‌నవూ: పోలీసుల కస్టడీలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రాను ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం అడ్డుకున్నారు. లఖ్‌నవూ - ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై టోల్‌ప్లాజా వద్ద ఆమె కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు ఆగ్రా వెళ్లేందుకు అనుమతిలేదని తెలిపారు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు ప్రియాంకను అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే..
ఆగ్రా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ స్టోరేజ్ హౌస్‌లో గత శనివారం చోరీ జరిగింది. అక్కడి లాకర్లో భద్రపర్చిన రూ.25లక్షలను దొంగలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అక్కడ క్లీనర్‌గా పనిచేస్తున్న అరుణ్ వాల్మికీని అనుమానితుడిగా కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో అతడు చోరీని అంగీకరించాడు. దొంగలించిన మొత్తాన్ని తన ఇంట్లో దాచిపెట్టినట్లు తెలిపాడు. దీంతో మంగళవారం రాత్రి పోలీసులు అరుణ్‌ను తీసుకుని అతడికి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అరుణ్ అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ ఉదయం అతడు మరణించాడు.
ఈ ఘటనపై స్థానికంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. అరుణ్ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా.. అరుణ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ మధ్యాహ్నం లఖ్‌నవూ నుంచి బయల్దేరారు. అయితే ఆమె కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు.. ఆగ్రాలోకి రాజకీయ నాయకులను అనుమతించొద్దని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు. దీంతో ప్రియాంక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘లఖ్‌నవూ నుంచి ఎక్కడకు వెళ్లాలన్నా నేను అనుమతులు తీసుకోవాలా? ఆగ్రాకు వెళ్తే సమస్యేంటీ? అక్కడ ఓ వ్యక్తి పోలీసు కస్టడీలో ప్రాణాలు కోల్పోయాడు. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే శాంతి భద్రతల సమస్య ఎలా అవుతుంది? నేను కేవలం లఖ్‌నవూ గెస్ట్హౌస్కే పరిమితం కావాలా?’’ అని ఆమె మండిపడ్డారు. తమను చూసి ప్రభుత్వం ఎందుకు ఇంతగా భయపడుతోందని ప్రశ్నించారు.
కాగా.. ఇటీవల యూపీలోని లఖింపుర్ ఖేరిఉద్రిక్త ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంకను పోలీసులు సీతాపూర్ వద్ద అడ్డుకుని రెండు రోజుల పాటు అతిథీగృహంలో నిర్బంధించిన విషయం తెలిసిందే. దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు ఆమెను విడుదల చేసి లఖింపుర్ వెళ్లేందుకు అనుమతిలిచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.