Rahul Gandhi: భారత్‌ పరిస్థితి శ్రీలంక మాదిరిగానే కనిపిస్తోంది..!

ప్రస్తుతం భారత్‌ పరిస్థితి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక మాదిరిగానే తయారయ్యిందని కాంగ్రెస్‌ అగ్రనేత రహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు.

Published : 18 May 2022 21:28 IST

వాస్తవాలను మార్చలేరంటూ ప్రభుత్వంపై మండిపడ్డ రాహుల్‌ గాంధీ

దిల్లీ: ప్రస్తుతం భారత్‌ పరిస్థితి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక మాదిరిగానే తయారయ్యిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నిరుద్యోగం, ఇంధన ధరలు, మతపరమైన హింస వంటి అంశాల్లో ఇరు దేశాల్లో పరిస్థితి ఒకే మాదిరిగా ఉందని ఆరోపించారు. ప్రజల దృష్టి మార్చినంత మాత్రాన వాస్తవాలు మారవన్న రాహుల్‌ గాంధీ.. ఇందుకు సంబంధించి ఓ గ్రాఫ్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

2017 నుంచి రెండు దేశాల్లో పెరుగుతూ వచ్చిన నిరుద్యోగం.. 2020నాటికి గరిష్ఠస్థాయికి చేరుకుంది. అనంతరం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఇరు దేశాల్లో ఇంధన ధరలను పోల్చుతూ.. 2017 నుంచి ఇరు దేశాల్లో క్రమంగా పెరుగుతూ 2021నాటికి భారీగా పెరిగిపోయాయి. మత హింసకు సంబంధించి రెండు దేశాల్లో 2020-2021లో ఎక్కువగా ఉందని గ్రాఫ్‌లో చూపించారు. తీవ్ర సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న శ్రీలంక మాదిరిగానే భారత్‌లోనూ పరిస్థితులు ఉన్నాయని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

రోజువారీ ఖర్చులకూ అప్పులు: ప్రియాంక 

దేశంలో నిత్యం పెరిగిపోతున్న ధరలను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. పేద, మధ్య తరగతి ప్రజలు రాబడిని పెంచేందుకు ఒక్క విధానం కూడా భాజపా ప్రభుత్వం దగ్గర లేదంటూ దుయ్యబట్టారు. దేశంలో పెరిగిపోతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు సంబంధించి మీడియాలో వచ్చిన నివేదికలను ట్విటర్‌లో షేర్‌ చేసిన ఆమె.. పేదలు కష్టపడి సంపాదించిన డబ్బంతా ద్రవ్యోల్బణం వల్ల దెబ్బతింటోందన్నారు. ఈ నేపథ్యంలో రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సి వస్తుందనే భయం పేదప్రజల్లో నెలకొందని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని