
West Bengal: భవానీపూర్ ఉపఎన్నిక.. దీదీ × ప్రియాంక
అభ్యర్థిని ఖరారు చేసిన భాజపా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలోకి దిగుతున్న భవానీపూర్ నియోజకవర్గం కీలకంగా మారింది. ఇక్కడ దీదీని ఎదుర్కొనేందుకు భారీ వ్యూహరచన చేసిన భాజపా.. నేడు అభ్యర్థిని ఖరారు చేసింది. భవానీపూర్ నుంచి న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్ పోటీ చేయనున్నట్లు ప్రకటించింది.
భవానీపూర్‌తో పాటు సంషేర్‌గంజ్, జాంగిపూర్ నియోజకవర్గాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఆ స్థానాలకు కూడా భాజపా నేడు అభ్యర్థులను ఖరారు చేసింది. సంషేర్‌గంజ్ నుంచి మిలన్ ఘోష్, జాంగిపూర్ నుంచి సుజిత్ దాస్ పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది.
ఎవరీ ప్రియాంక..
41ఏళ్ల ప్రియాంక టిబ్రివాల్ కలకత్తా హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. 2014లో ఆమె భాజపాలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ యువ విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎంపీ బాబుల్ సుప్రియోకు న్యాయ సలహాదారుగా పనిచేశారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతాల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. బెంగాల్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల కేసును కూడా వాదిస్తున్నారు.
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ నుంచి తృణమూల్ నేత సోభాందేవ్ ఛటోపాధ్యాయ పోటీ చేసి విజయం సాధించారు. అయితే నందిగ్రామ్‌లో మమత ఓడిపోయిన నేపథ్యంలో సోభాందేవ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక భవానీపూర్ నుంచి దీదీ గతంలో రెండు సార్లు విజయఢంకా మోగించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.