నందిగ్రామ్‌లో 144 సెక్షన్‌

పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో భాగంగా గురువారం(ఏప్రిల్‌ 1) రెండో విడత పోలింగ్‌ జరగనుంది. మొత్తం 294 నియోజకవర్గాలకు గానూ.. 30 స్థానాలకు ఓటింగ్‌ నిర్వహించనున్నారు

Published : 31 Mar 2021 15:41 IST

నందిగ్రామ్‌: పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో భాగంగా గురువారం(ఏప్రిల్‌ 1) రెండో విడత పోలింగ్‌ జరగనుంది. మొత్తం 294 నియోజకవర్గాలకు గానూ.. 30 స్థానాలకు ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో ఉత్కంఠ పోరుకు తెరలేపిన నందిగ్రామ్‌ అసెంబ్లీ స్థానానికి కూడా రేపే పోలింగ్‌ జరగనుంది. అయితే ఈ సమస్యాత్మక ప్రాంతంలో అల్లర్లు చెలరేగే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ అక్కడ నిషేధాజ్ఞలు జారీ చేసింది. నందిగ్రామ్‌ వ్యాప్తంగా నేటి నుంచి 144 సెక్షన్‌ విధించినట్లు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. 

‘‘మమతా బెనర్జీ, సువేందు అధికారి వంటి అత్యంత ప్రముఖ నేతలు పోటీలో ఉన్నందున ఈ నియోజకవర్గాన్ని సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించాం. అందుకే శాంతిభద్రతల విషయంలో రాజీపడట్లేదు. ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసేందుకు రావాలి. అందుకే ఇక్కడ నిషేదాజ్ఞలు విధించాం. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. పోలింగ్‌ పూర్తయ్యే వరకు నందిగ్రామ్‌ ఓటరు కాని ఏ వ్యక్తినీ నియోజకవర్గంలోకి అనుమతించేది లేదు’’ అని అధికారులు స్పష్టం చేశారు. 

అంతేగాక, ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడరాదని ఈసీ ఆదేశించింది. మరోవైపు హెలికాప్టర్లతో నిఘా పెంచినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్‌ దృష్ట్యా ఈ ప్రాంతంలో 22 కంపెనీల కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. రాష్ట్ర పోలీసులు కూడా భారీగా మోహరించారు. నియోజకవర్గానికి వచ్చే అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బయటి వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. అల్లర్లకు పాల్పడాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని