YSRCP: అన్నీ ఒట్టి మాటలేనా?.. వైకాపా ఎమ్మెల్యేకు నిరసన సెగ

వైకాపా ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు నిరసన సెగ తగిలింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గ పరిధిలోని జి.సిగడాంలో పర్యటించిన ఆయనకు నిద్దాం గ్రామస్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 

Published : 26 Mar 2023 01:27 IST

ఎచ్చెర్ల: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడాం మండలం నిద్దాం పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కు నిరసన సెగ తగిలింది. ఇప్పటి వరకు సమస్యలు పరిష్కరించలేదంటూ గ్రామస్థులు ఎమ్మెల్యేను నిలదీశారు. నిద్దాం గ్రామానికి తారు రోడ్డు వేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని.. ఇప్పటివరకు నెరవేర్చలేదని అన్నారు. తాగునీటికోసం ఇబ్బందులు పడుతున్నామని చెబితే.. ఇంటింటికీ కుళాయి వేస్తామని చెప్పి.. ఇప్పటి వరకు ఆ ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ నిరుద్యోగ యువతకు మీరొచ్చాక ఎన్ని ఉద్యోగాలిచ్చారు. డీఏస్సీ తీయలేదు, అరకొర నోటిఫికేషన్‌లు ఇస్తున్నారు. ఎలా సరిపోతాయి?’’ అంటూ యువత ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణం కోసం 35 మంది దరఖాస్తు చేస్తే 19 మందికి మాత్రమే మంజూరు చేశారని, మిగిలిన వారికి ఇప్పటికీ మంజూరు చేయలేదని ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో పాటు గ్రామంలో వివిధ మహిళా సంఘాల్లో 800 మంది సభ్యులు ఉంటే 25 మంది మహిళలకు మాత్రమే సున్నా వడ్డీ వచ్చిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి తారు రోడ్డు ఎప్పుడు వేస్తారో స్పష్టమైన హామీ ఇవ్వాలని గ్రామస్థులు పట్టుబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని