ఎట్టకేలకు సీఎం రంగస్వామి టీమ్‌ సిద్ధం!

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మంత్రివర్గం కుర్పుపై దాదాపు 50 రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. మంత్రి పదవుల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ....

Published : 26 Jun 2021 01:22 IST

పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మంత్రివర్గం కూర్పుపై దాదాపు 50 రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. మంత్రి పదవుల పంపకం పూర్తయింది. ఎన్డీయే కూటమిలో భాగంగా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌కు మూడు, భాజపాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ వ్యవస్థాపకుడు రంగస్వామి ప్రమాణస్వీకారం చేయగా.. కొత్త మంత్రులంతా ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ కలిసి పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో మే 7న రంగస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల ఫలితాలు మే 2న వెల్లడైనప్పటికీ డిప్యూటీ సీఎం పదవి కోసం తొలుత భాజపా పట్టుబట్టడంతో మంత్రివర్గ కూర్పుపై ముందడుగు పడలేదు. చివరకు స్పీకర్‌ పదవికి భాజపా అంగీకరించడంతో ఈ వ్యవహారం కొలిక్కి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రంగస్వామి బుధవారం గవర్నర్‌ తమిళి సైకి మంత్రుల జాబితాను అందజేశారు. పుదుచ్చేరిలో మొత్తం ఆరు మంత్రి పదవులకు గాను.. సీఎం రంగస్వామి సహా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌కు నాలుగు, భాజపాకు రెండు మంత్రి బెర్త్‌లను పంచుకున్నారు. 

మొత్తం 30 స్థానాలు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 10 స్థానాల్లో గెలవగా.. భాజపా ఆరు చోట్ల విజయం సాధించింది. ఈసారి కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ తగిలింది. గతంలో 15 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌ ఈసారి కేవలం రెండు స్థానాలకే పరిమితమైపోయింది. ఇకపోతే డీఎంకే ఆరు చోట్ల విజయం సాధించగా.. స్వతంత్రులు ఆరుచోట్ల విజయం సాధించారు. వీరిలో ముగ్గురు ఎన్‌ఆర్ కాంగ్రెస్‌ -భాజపా కూటమికి మద్దతు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని