22న పుదుచ్చేరిలో బలపరీక్ష.. కాంగ్రెస్‌ గట్టెక్కేనా?

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే తమిళిసై సౌందరరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాలతో మైనారిటీలో పడి.

Updated : 18 Feb 2021 19:09 IST

పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే తమిళిసై సౌందరరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాలతో మైనారిటీలో పడిన నారాయణస్వామి ప్రభుత్వానికి బలం నిరూపించుకోవాలని సూచించారు. ఇందుకోసం ఈ నెల 22 సోమవారం సాయంత్రం ఐదు గంటలకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహణకు ఆదేశించారు. దీంతో ఆ రోజు నారాయణ స్వామి ప్రభుత్వ భవితవ్యం తేలనుంది.

పుదుచ్చేరి శాసనసభలో 30 స్థానాలుండగా గతంలో కాంగ్రెస్‌, డీఎంకే, స్వతంత్ర అభ్యర్థితో కూడిన కూటమి 18 మంది సభ్యుల బలంతో నారాయణస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇటీవల మంత్రి నమశివాయం, ఎమ్మెల్యే తీపాయన్‌దాన్‌ రాజీనామా చేసి భాజపాలో చేరారు. సోమ, మంగళవారాల్లో ఎమ్మెల్యేలు మల్లాడి కృష్ణారావు, జాన్‌కుమార్‌ రాజీనామాలు చేశారు. అంతకుముందు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ధనవేలుపై కాంగ్రెస్‌ పార్టీ వేటు వేయడంతో ఆయన ఓటు చెల్లదు. దీంతో ప్రస్తుతం ఆ కూటమి బలం 14కు చేరింది. ఇందులో స్పీకర్‌తో కలిపి కాంగ్రెస్‌కు 10 మంది సభ్యుల బలం ఉండగా..  డీఎంకేకు చెందిన ముగ్గురు, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతిస్తున్నారు. మరోవైపు ఎన్నార్‌ కాంగ్రెస్‌ (7), అన్నాడీఎంకే (4), భాజపా (3 నామినేటెడ్‌)తో కూడిన కూటమి బలం కూడా పద్నాలుగే ఉంది. ప్రస్తుతం సభలో సభ్యుల సంఖ్య 28కి చేరిన నేపథ్యంలో మేజిక్‌ ఫిగర్‌ 15 అయ్యింది. రెండు కూటములూ మేజిక్‌ ఫిగర్‌కు ఒక్క స్థానం దూరంలో నిలిచిన వేళ బలపరీక్ష నిర్వహిస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఈ పరిణామాలు చోటుచేసుకోవడంతో రాజకీయం రక్తికడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని