Pulwama: రాజస్థాన్‌లో పుల్వామా వీరపత్నుల నిరసన హింసాత్మకం

పుల్వామా (Pulwama) అమరవీరులు భార్యలు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. భాజపా శ్రేణులు దాడికి దిగడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేయాల్సి వచ్చింది.

Published : 11 Mar 2023 18:50 IST

జైపూర్: పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల సతీమణులు చేపట్టిన ఆందోళన రాజస్థాన్‌లో కొత్త రాజకీయ వివాదానికి తెరతీసింది. ఈ నిరసనకు సంఘీభావం తెలిపేందుకు భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేయాల్సి వచ్చింది. రాజకీయ ప్రయోజనాల కోసం భాజపా వితంతువులను వాడుకుంటోందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఆరోపించగా.. తనను చంపేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని భాజపా నేత కిరోడి లాల్‌ మీనా విమర్శించారు.

అమరవీరుల స్వగ్రామాలకు రోడ్లు వేయాలని, వారి విగ్రహాలను ప్రతిష్ఠించాలని కోరుతూ గత కొన్నాళ్లుగా పుల్వామా అమరవీరుల భార్యలు ఆందోళన చేపడుతున్నారు. కేవలం తమ పిల్లలకు మాత్రమే కాకుండా బంధువులు కూడా ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులయ్యేలా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో శుక్రవారం డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ నివాసం వద్ద భాజపా నేత కిరోడి లాల్‌ మీనా ఆధ్వర్యంలో అమరవీరుల భార్యలు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వారి నివాస ప్రాంతాలకి దగ్గర్లో ఉన్న ఆస్పత్రులకి తరలించి ఆందోళన సద్దుమణిగేలా చేశారు. కిరోడి లాల్‌ మీనాను అదుపులోకి తీసుకోవడానికి నిరసనగా.. ఇవాళ ఉదయం భాజపా కార్యకర్తలు, అమరవీరుల భార్యలు జైపూర్‌లోని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఇంటి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు రోడ్డుకి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆందోళనకారులు కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడికి దిగారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది.

ఇవాళ ఆందోళనలకు ముందు ముఖ్యమంత్రి గహ్లోత్‌ను గతంలో వివిధ సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల భార్యలు కలిశారు. కుటుంబ సభ్యులకు కాకుండా కేవలం తమ పిల్లలకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని సీఎంకు విన్నవించారు. అయితే పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి భార్యలు మాత్రం గహ్లోత్‌ని కలవకపోవడం గమనార్హం. తాజా ఘటనపై స్పందించిన భాజపా.. రాజస్థాన్‌ ప్రభుత్వం వితంతువులను చులకన భావంతో చూస్తోందని విమర్శించింది. అమరవీరుల కుటుంబాలకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తాత్సారం చేస్తోందని ఆరోపించింది.

మాటకు కట్టుబడి ఉన్నాం: సచిన్‌పైలట్‌

అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు రాష్ట్రప్రభుత్వం ఇప్పటికీ కట్టుబడి ఉందని సచిన్‌పైలట్‌ అన్నారు. వారి స్వగ్రామాలకు రోడ్లు వేయించడంతోపాటు, అమరవీరుల విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. అయితే, వితంతువుల గోడును రాష్ట్ర ప్రభుత్వం వినడానికి సిద్ధంగా లేదు అనే సందేశం ప్రజల్లోకి వెళ్లకూడదని ఆయన అన్నారు. వారి సమస్యలను తీర్చుతామా?లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే..వారి సమస్యలను వినేటప్పుడు ఎవరైనా తమ అహాన్ని పక్కన పెట్టాలని పరోక్షంగా సీఎం గహ్లోత్‌కు సచిన్‌ పైలట్‌ చురకలంటించారు.కేవలం అమరవీరుల పిల్లలకి మాత్రమే కాకుండా బంధువులు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు అవకాశం కల్పించేలా నిబంధనల్లో మార్పులు చేయాలంటూ పుల్వామా అమరవీరుల భార్యలు ఫిబ్రవరి 28 నుంచి ఆందోళన చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు