AAP: పంజాబ్‌లో ‘ఆపరేషన్‌ కమలం’.. ఒక్కో ఆప్‌ ఎమ్మెల్యేకు ₹25 కోట్లు ఆఫర్!

పంజాబ్‌లో అఖండ విజయంతో ఏర్పాటైన భగవంత్‌ మాన్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందంటూ ఆప్‌ చేస్తోన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.....

Published : 14 Sep 2022 01:24 IST

ఆర్థిక మంత్రి హర్‌పాల్‌ సింగ్‌ చీమా ఆరోపణ

చండీగఢ్‌: పంజాబ్‌లో అఖండ విజయంతో ఏర్పాటైన భగవంత్‌ మాన్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందంటూ ఆప్‌ చేస్తోన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.  దాదాపు 10 మంది ఆప్‌ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20 నుంచి రూ.25కోట్లు చొప్పున భాజపా నేతలు ఆఫర్‌ చేసినట్టు పంజాబ్‌ ఆర్థికమంత్రి హర్‌పాల్‌ సింగ్‌ చీమా ఆరోపించారు. ‘ఆపరేషన్‌ కమలం’లో భాగంగా కొందరు భాజపా నేతలు ఆప్‌ ఎమ్మెల్యేలను సంప్రదించినట్టు తెలిపారు. ఏడుగురు నుంచి పది మంది ఆప్‌ ఎమ్మెల్యేలకు డబ్బు, మంత్రి పదవులు ఆఫర్‌ చేశారన్నారు. అయితే, ఆప్‌ చేసిన ఆరోపణలపై భాజపా ఇప్పటివరకు స్పందించలేదు. 

చండీగఢ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హర్‌పాల్‌ సింగ్‌ చీమా మాట్లాడుతూ.. ‘‘పంజాబ్‌లో ఆప్‌ ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చేందుకు భాజపా కేంద్ర నాయకత్వం పంపిన కొందరు నేతలు మా ఎమ్మెల్యేలను ఫోన్‌లో కాంటాక్టు చేశారు. దిల్లీలోని అగ్ర నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, ఒక్కొక్కరికి రూ.25 కోట్లు చొప్పున ఆఫర్‌ చేశారు. ఒకవేళ తమ  వెంట వేరే ఎమ్మెల్యేలను తీసుకొస్తే అదనంగా డబ్బు ఇస్తామని చెప్పారు’’ అని చీమా ఆరోపించారు.

దిల్లీలో ‘ఆపరేషన్‌  లోటస్‌’ విఫలం.. అందుకే..

గతంలో దిల్లీలో ఆప్‌ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకొని చేసిన ఇలాంటి ప్రయత్నమే విఫలమైందని.. ఇప్పుడు పంజాబ్‌లో ఆప్‌ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు భాజపా ప్రయత్నిస్తోందని మంత్రి మండిపడ్డారు. గత వారం రోజులుగా నిరంతరం ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. భాజపా నేతలు ఏడుగురు నుంచి పది మంది వరకు తమ ఎమ్మెల్యేలను సంప్రదించారన్న మంత్రి చీమా.. ఎవరెవరికి ఈ ఆఫర్‌ చేశారనే విషయాలు వెల్లడించేందుకు నిరాకరించారు. ఆప్‌ ఎమ్మెల్యేలను సంప్రదించిన వారిలో పంజాబ్‌కు చెందిన భాజపా నేతలు కొందరు ఉండగా.. మరికొందరు దిల్లీకి చెందినవారు ఉన్నట్టు ఆరోపించిన ఆయన.. దీనికి సంబంధించిన ఆధారాలను సరైన సమయంలో బయటపెడతామన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని