Amarinder Singh: రాజీనామా యోచనలో పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌?

తాజా పరిణామాలతో విసిగిపోయానని సీఎం అమరీందర్‌ సింగ్‌ అధిష్ఠానానికి తెలిపినట్లు సమాచారం. సీఎం పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది....

Updated : 18 Sep 2021 13:26 IST

చండీగఢ్‌: పంజాబ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం ముదిరినట్లు సంకేతాలు వస్తున్నాయి. తాజా పరిణామాలతో విసిగిపోయానని సీఎం అమరీందర్‌ సింగ్‌ అధిష్ఠానానికి తెలిపినట్లు సమాచారం. సీఎం పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా గవర్నర్‌కు రాజీనామా లేఖ అందించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఈరోజు సాయంత్రం పంజాబ్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్షం సమావేశమై అమరీందర్‌ వారసుణ్ని ఎన్నుకోనున్నట్లు సమాచారం.

పంజాబ్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి హరీశ్‌ రావత్‌ దాదాపు అర్ధరాత్రి సమయంలో చేసిన ట్వీట్‌తో తాజా పరిణామాలకు నాంది పడింది. అత్యవసర శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు.. ప్రతిఒక్కరూ హాజరు కావాలని ఆయన కోరారు. ఆ వెంటనే పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూ సైతం ప్రతిఒక్కరూ సమావేశానికి రావాలని ఆదేశించారు. పైకి ఇవన్నీ హఠాత్తుగా జరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ.. గత కొంతకాలంగా పార్టీలో అంతర్గతంగా లుకలుకలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

సీఎం వ్యతిరేక వర్గం అధిష్ఠానానికి ఇటీవల లేఖ రాసినట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి అమరీందర్‌ చేరుకోవాల్సిన లక్ష్యాల పురోగతిపై సమీక్ష జరపాలని కోరినట్లు సమాచారం. ఈ ఒత్తిడి నేపథ్యంలోనే అధిష్ఠానం సీఎల్పీ సమావేశం నిర్వహించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే, అధిష్ఠానం తొలుత కొంతమంది పెద్దలను పంపి పంజాబ్‌ కాంగ్రెస్‌లో పరిస్థితులపై ఆరా తీయాలని భావించిందట! కానీ, ఇది తప్పుడు సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని.. అమరీందర్‌ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య భేదాభిప్రాయాలు ముదిరే అవకాశం ఉందని భావించి.. చివరకు సీఎల్పీ సమావేశం వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

అయితే, ఈ పరిణామాలతో అమరీందర్‌ సింగ్‌ విసిగిపోయినట్లు తెలుస్తోంది. తన అసంతృప్తిని ఆయన నేరుగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముందు వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎం మార్పు జరుగుతోందంటూ గత కొంత కాలంగా వార్తలు రావడం తనకు అవమానకరంగా ఉందని సోనియా ముందు వాపోయినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఓ వర్గం తనపై కొన్ని నెలలుగా తిరుగుబాటుకు ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో పార్టీ సీఎల్పీ సమావేశానికి పిలుపునివ్వడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇక తాను పదవిలో కొనసాగలేనని తెలిపినట్లు తెలుస్తోంది.

కొంతకాలం క్రితం సిద్ధూ, అమరీందర్‌ సింగ్‌ మధ్య కోల్డ్‌ వార్‌ నడిచిన విషయం తెలిసిందే. అయితే, రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఓవైపు ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ను బుజ్జగిస్తూనే మరోవైపు నవజోత్‌ సింగ్‌ సిద్ధూకు పీసీసీ బాధ్యతలు అప్పజెప్పారు. తొలుత కెప్టెన్‌ అమరీందర్‌ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ అధిష్ఠానం ఆదేశాల మేరకు సిద్ధూతో కలిసి పనిచేసేందుకు అంగీకరించారు. అయినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు మారలేదని తాజా పరిణామాలతో అర్థమవుతోంది. 


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని