Punjab CM: ‘మంచి దుస్తులు కొనుక్కునేందుకు కేజ్రీవాల్‌కు రూ. 5వేలు ఇవ్వండి’

ఆప్‌ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో చన్నీ మాట్లాడుతూ.....

Published : 07 Oct 2021 01:15 IST

చండీగఢ్‌: పంజాబ్‌లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అక్కడ పాగా వేయాలని చూస్తోంది. కాగా రానున్న ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌, ఆప్‌నకు మధ్య గట్టి పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా ఆప్‌ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో చన్నీ మాట్లాడుతూ.. ‘మీ దగ్గర రూ.5వేలు ఉంటే కేజ్రీవాల్‌కు ఇవ్వండి. ఆయనకు మంచి దుస్తులు అవసరం. ఆయన జీతం రూ. 2.5లక్షలు. మంచి దుస్తులు కొనుక్కోలేరా?’ అంటూ చన్నీ కేజ్రీవాల్‌ను విమర్శించారు.

పంజాబ్‌ సీఎం వ్యాఖ్యలపై కేజ్రీవాల్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. చన్నీకి తన దుస్తులు నచ్చకపోయినా పర్వాలేదని.. ప్రజలకు ఆ దుస్తులు నచ్చుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చన్నీకి 4 ప్రశ్నలు సంధిస్తూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నించారు. ‘చన్నీ గారు.. మీకు నా దుస్తులు నచ్చడం లేదా.. అయినా ఏం పరవాలేదు. ప్రజలకు నచ్చుతున్నాయి. అది చాలు. దుస్తుల గురించి వదిలేయండి. ప్రజలకు మీరిచ్చిన ఈ వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుస్తారు? 1. ప్రతి నిరుద్యోగికి ఎప్పుడు ఉపాధి కల్పిస్తారు? 2. రైతుల రుణాలను ఎప్పుడు మాఫీ చేస్తారు? 3. మతం పేరుతో అల్లర్లకు పాల్పడేవారిని జైళ్లకు ఎందుకు పంపడం లేదు? 4. అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు?’ అంటూ 4 ప్రశ్నలు సంధించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని