Charanjit Singh Channi: సీఎం అభ్యర్థిగా ప్రకటించగానే.. సిద్ధూ పాదాలను తాకిన చన్నీ..!

రోజుల తరబడి ఉత్కంఠకు తెరదించుతూ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీని పేరును ఖరారు చేసింది హస్తం

Published : 07 Feb 2022 13:34 IST

లూథియానా: రోజుల తరబడి ఉత్కంఠకు తెరదించుతూ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Punjab Election 2022) కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ (Charanjit Singh Channi) పేరును ఖరారు చేసింది హస్తం పార్టీ. లూథియానాలో ఆదివారం జరిగిన వర్చువల్‌ సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఈ మేరకు ప్రకటన చేశారు. అయితే ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎంగా తన పేరును ప్రకటించగానే చన్నీ.. పక్కనే కూర్చున్న పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ (Navjot Singh Sidhu) పాదాలను తాకారు.

ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం తీవ్రస్థాయిలో పోటీ పడ్డ సిద్ధూ, చన్నీ ఈ వేదికపై పక్కపక్కనే కూర్చున్నారు. రాహుల్.. చన్నీ పేరును ప్రకటించగానే పక్కనే ఉన్న సిద్ధూ ఆయనను అభినందించారు. చన్నీ చేయి పైకెత్తి అభివాదం చేయించారు. ఆ సమయంలో చన్నీ.. సిద్ధూ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత రాహుల్‌ గాంధీ వచ్చి సిద్ధూ, చన్నీలను ఆత్మీయంగా హత్తుకున్నారు. అనంతరం చన్నీ మాట్లాడుతూ.. ‘‘సిద్ధూజీ.. మీ సూచనలను మేం అమలు చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు. 

పంజాబ్‌లో ఇటీవల నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై గత కొన్ని రోజులుగా ఉత్కంఠ కొనసాగింది. ముఖ్యంగా ఈ అభ్యర్థిత్వానికి పోటీ పడిన సిద్ధూ.. ఇటీవల సీఎం ఎంపిక విషయంలో పార్టీ హైకమాండ్‌ను టార్గెట్‌ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టాప్‌లో ఉన్నవారు బలహీనమైన వ్యక్తి సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. అయితే పార్టీ నిర్ణయం ఏదైనా దాన్ని తాను స్వాగతిస్తానని చెప్పిన సిద్ధూ.. నిన్న కూడా మరోసారి అదే విషయాన్ని చెప్పారు. ‘‘నిర్ణయాలు తీసుకునే అధికారం నాకు ఇవ్వకపోయినా.. తదుపరి సీఎంకు నేను మద్దతిస్తాను’’ అని అన్నారు. కానీ, చివర్లో తానేమీ షోపీస్‌ కాదని చెప్పడం గమనార్హం. 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా చన్నీ ఎంపిక.. పార్టీలో అంతర్గత కమ్ములాటలకు దారితీస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఈ పరిణామాలు కాంగ్రెస్‌కు ఎలాంటి ఫలితాలనిస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజా పరిస్థితుల్లో సిద్ధూ సర్వశక్తులొడ్డి కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చుతారా? లేక.. పార్టీకి పరోక్షంగా ఝలక్‌లు ఇస్తారా? అనేది చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని