Punjab Polls: కాంగ్రెస్‌ తొలి జాబితా.. సోనూసూద్‌ సోదరి పోటీ ఇక్కడి నుంచే!

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్‌ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తన అధికార పీఠాన్ని నిలుపుకోవడమే లక్ష్యంగా......

Published : 16 Jan 2022 03:32 IST

సిట్టింగ్ స్థానాల నుంచే సీఎం చన్నీ, సిద్ధూ పోటీ

(ఇటీవల మాళవిక సూద్‌ కాంగ్రెస్‌లో చేరినప్పటి చిత్రం)

దిల్లీ: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్‌ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తన అధికార పీఠాన్ని నిలుపుకోవడమే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం మొత్తం 86మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్‌ చన్నీ ఈసారి కూడా చామ్‌కౌర్‌ సాహెబ్‌ నుంచి బరిలో దిగుతుండగా.. పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూ అమృత్‌సర్‌ తూర్పు నుంచి పోటీ చేయనున్నారు. అలాగే, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌ సోదరి మాళవిక సూద్‌కు మోగ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. ఉపముఖ్యమంత్రి సుఖ్‌జిందర్‌ సింగ్‌ రాంధ్వా డేరాబాబా నానక్‌ స్థానం నుంచి, రవాణాశాఖ మంత్రి రాజా అమరిందర్‌ గిద్దర్బహా నుంచి బరిలో దిగుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్ఠానం రూపొందించిన అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్‌ వాస్నిక్‌ విడుదల చేశారు.

గతంలో కాంగ్రెస్‌లో చేరిన వివాదాస్పద పంజాబీ సింగర్‌ సిద్ధూ ముస్సెవాలాను మాన్సా నుంచి బరిలో దించుతుండగా.. కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ ప్రతాప్‌ సింగ్‌ బజ్వాకు గురుదాస్‌పూర్‌లోని క్వాదియాన్‌ టికెట్‌ కేటాయించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రచార కమిటీ అధ్యక్షుడు సునీల్‌ జాకర్‌ ఈ ఎన్నికల్లో పోటీచేయడంలేదు. అయితే, ఆయన అల్లుడు సందీప్‌ జాగర్‌కు అబోహర్‌ స్థానాన్ని కేటాయించారు. అలాగే, పంజాబ్‌ మంత్రి బ్రహ్మ మొహింద్ర కూడా ఈసారి పోటీచేయకపోవడంతో ఆయన తనయుడు మోహిత్‌ మొహింద్రా పటియాలా రూరల్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 117 స్థానాలు కలిగిన పంజాబ్‌ అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని