Punjab Politics: సీఎల్పీ కాదు.. పంజాబ్‌ సీఎంను సోనియానే నిర్ణయిస్తారు!

పంజాబ్‌ కొత్త సీఎం ఎంపికకు నేడు శాసనసభాపక్షం భేటీ కావాల్సి ఉండగా.. అది వాయిదా పడింది. పార్టీ అధిష్ఠానమే ముఖ్యమంత్రి పేరును ఖరారు చేయనున్నట్లు సమాచారం....

Published : 19 Sep 2021 14:04 IST

చండీగఢ్‌ : పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవికి అమరీందర్‌ రాజీనామా చేయడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా కొత్త సీఎం ఎంపికకు నేడు శాసనసభాపక్షం భేటీ కావాల్సి ఉండగా.. అది వాయిదా పడింది. పార్టీ అధిష్ఠానమే ముఖ్యమంత్రి పేరును ఖరారు చేయనున్నట్లు సమాచారం. దీనిపై ఎమ్మెల్యే పర్గాత్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘సీఎం ఎంపిక అధినాయకత్వం చేతిలో ఉంది. నిన్ననే సీఎల్పీ భేటీ జరిగింది. మా అభిప్రాయాన్ని అప్పుడే చెప్పాం’’ అని పేర్కొన్నారు.

ఈ విషయంపై పంజాబ్‌ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పవన్ గోయెల్‌ మాట్లాడుతూ.. ‘‘కేంద్ర పరిశీలకులు అజయ్‌ మాకెన్‌, హరీశ్‌ రావత్‌తో శనివారం భేటీ అయ్యాం. అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తీర్మానించాం. ఆమె నిర్ణయం ఈరోజు తెలుస్తుంది’’ అని తెలిపారు.

సీఎం రేసులో ముందున్న ముగ్గురిలో ఒకరైన సునీల్‌ జాఖడ్‌ పేరును పలువురు మంత్రులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా మంది ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అయితే, మరికొంత మంది కూడా సీఎం పీఠంపై ఆసక్తి కనబరుస్తుండడంతో.. అధిష్ఠానం ఉపముఖ్యమంత్రి పదవులను కూడా తెరపైకి తెచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరోవైపు పంజాబ్‌ పరిణామాలపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ స్పందించారు. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పార్టీకి నష్టం కలిగించే పని చేయబోరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనొక గౌరవప్రదమైన వ్యక్తి అని.. భవిష్యత్తులోనూ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తారని ఆశిస్తున్నానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని