Punjab polls: చన్నీనే సీఎం అభ్యర్థి.. ప్రకటించిన రాహుల్‌

ఉత్కంఠకు తెరపడింది. కొద్దిరోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పంజాబ్‌ సీఎం ఎవరనేదానిపై సందిగ్ధత వీడింది......

Updated : 06 Feb 2022 17:48 IST

దిల్లీ: ఉత్కంఠకు తెరపడింది. కొద్దిరోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పంజాబ్‌ సీఎం ఎవరనేదానిపై సందిగ్ధత వీడింది. సీఎం అభ్యర్థిని ఆ పార్టీ ప్రధాన నేత రాహుల్‌ గాంధీ ఆదివారం ప్రకటించారు. ఎలాంటి ప్రయోగాలకు పోకుండా.. ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ చన్నీనే సీఎం అభ్యర్థిగా రాహుల్‌ ఎన్నుకున్నారు. లూధియానాలో నిర్వహించే ర్యాలీ సందర్భంగా అభ్యర్థిని ప్రకటించారు.

ప్రస్తుత అయిదు రాష్ట్రాల ఎన్నికల సమరంలో.. కాంగ్రెస్‌ పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ఈ స్థానానికి ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్‌ సింద్‌ సిద్ధూ మధ్య పోటాపోటీ నెలకొంది. ఈనేపథ్యంలోనే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్‌) ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం.. చన్నీ వైపే మొగ్గుచూపింది.

సీఎం అభ్యర్థిత్వంపై చన్నీ, సిద్ధూ మధ్య పొరపొచ్చాలు తలెత్తిన విషయం తెలిసిందే. అధిష్ఠానం వీరిద్దరికి సర్దిచెప్పడంతో.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇరువురు పేర్కొన్నారు. సీఎం అభ్యర్థిని రాహుల్‌ ప్రకటించే కొన్ని గంటల ముందు సిద్ధూ పలు ట్వీట్లు చేశారు. ‘స్పష్టమైన నిర్ణయం లేకుండా గొప్పదేదీ సాధించలేం. పార్టీ సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై పంజాబ్‌కు క్లారిటీ ఇవ్వడానికి వచ్చిన మా మార్గదర్శి రాహుల్ గాంధీకి హృదయపూర్వక స్వాగతం. ఆయన నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం!’ అని రాసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని