Punjab Polls: పంజాబ్‌లో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోతుంది : కెప్టెన్‌

పంజాబ్‌లో కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ, ఎన్‌డీఏ కూటమి మధ్య అక్కడ హోరాహోరీ పోటీ ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా.. మధ్యాహ్నం వరకు కాస్త మందకొడిగా సాగుతోంది.

Published : 20 Feb 2022 13:58 IST

కొనసాగుతోన్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

చండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలను పలు రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ, ఎన్‌డీఏ కూటమి మధ్య అక్కడ హోరాహోరీ పోటీ ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా.. మధ్యాహ్నం వరకు కాస్త మందకొడిగా సాగింది. ఓటు హక్కు వినియోగించుకుంటున్న పలు పార్టీల ప్రముఖులు.. ప్రజలు ముందుకు వచ్చి ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోతుంది.. కెప్టెన్

‘పటియాలా నుంచి గెలుపొందడం ఖాయం. ఈ ఎన్నికల్లో మాదే విజయమని భావిస్తున్నాం. కాంగ్రెస్‌ పార్టీ మరో ప్రపంచంలో జీవిస్తోంది. ఈ ఎన్నికలతో పంజాబ్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది’ అని పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ వ్యవస్థాపకుడు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ వెల్లడించారు. అమరీందర్‌ సింగ్‌ పోటీలో ఉన్న పటియాలా అసెంబ్లీ స్థానం ఈసారి కీలకంగా మారింది. 2017 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన కెప్టెన్‌.. 52వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం ఆ స్థానం నుంచి ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్‌ పార్టీలు మాజీ మేయర్లను బరిలో నిలిపాయి. శిరోమణి అకాలీదళ్‌ కూడా మాజీ కౌన్సిలర్‌ను పోటీలో నిలిపింది. పటియాలాలో ఈ తరహా పోటీ గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడలేదని స్థానిక రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.

ఆ రెండు పార్టీలు ఒకటై ఆప్‌పై విమర్శలు

ఆప్‌ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్‌ మన్‌ మొహాలీలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆమ్‌ఆద్మీ పార్టీపై విమర్శలు గుప్పించేందుకు కాంగ్రెస్‌, భాజపా చేతులు కలిపాయని ఆరోపించారు. అయినప్పటికీ పంజాబ్‌ ప్రజలు వీటన్నింటినీ గమనిస్తూనే ఉన్నారని అన్నారు. పంజాబ్‌ ఎన్నికల్లో భాగంగా అక్కడి అధికార కాంగ్రెస్‌తో పాటు ఎన్డీయే కూటమికి ఆమ్‌ఆద్మీ పార్టీ ఈసారి గట్టి పోటీ ఇస్తోన్నట్లు తెలుస్తోంది.

వారి మధ్యే పోటీ..

ఓవైపు డ్రగ్స్‌, మాఫియా మరోవైపు పంజాబ్‌ మార్పు కోరుకునే వారి మధ్య జరుగుతోన్న పోరులో జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూ అక్కడి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఖాయమన్నారు.

స్వతంత్ర అభ్యర్థిగా చన్నీ సోదరుడు..

కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చరణ్‌జిత్‌ చన్నీ పేరును అధిష్ఠానం ప్రకటించి మంచి నిర్ణయం తీసుకుందని ఆయన సోదరుడు మనోహర్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీదే మరోసారి గెలుపు ఖాయమన్న ఆయన.. తన నియోజకవర్గంలో గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ తనను మాత్రం పార్టీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన చారణ్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆ నియోజకవర్గంలో తాను విజయం సాధించనున్నట్లు తమ సర్వేలో తేలిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని