Updated : 24 Jan 2022 22:41 IST

Punjab Election 2022: పంజాబ్‌లో 65 చోట్ల భాజపా పోటీ.. కెప్టెన్‌కు 37 సీట్లు

అమరీందర్‌ సింగ్‌తో కమలదళం సీట్ల సర్దుబాటు ఖరారు

చండీగఢ్‌: పంజాబ్‌ (Punjab) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections 2022) భారతీయ జనతా పార్టీ, మిత్ర పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. ఈ ఎన్నికల్లో భాజపా (BJP) మొత్తం 65 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఇక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్ (Amarinder Singh) నేతృత్వంలోని పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌కు 37 సీట్లు కేటాయించింది. మరో కూటమి పార్టీ శిరోమణి అకాలీదళ్‌ (సంయుక్త్‌)కు 15 సీట్లు ఇస్తున్నట్లు భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం ప్రకటించారు. 

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పొత్తుకు భాజపా తెరతీసిన విషయం తెలిసిందే. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ‘పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌’ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఈ పార్టీతో భాజపా చేతులు కలిపింది. దీంతో పాటు సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్‌( సంయుక్త్‌) పార్టీ కూడా భాజపాతో పొత్తు పెట్టుకుంది. ఈ మూడు పార్టీలు కలిసి పంజాబ్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించి.. తాజాగా సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. 

ఇప్పటికే అమరీందర్‌ సింగ్‌ 22 మంది అభ్యర్థులతో పార్టీ తొలి జాబితాను విడుదల చేశారు. కెప్టెన్‌ పాటియాలా అర్బన్‌ నుంచి పోటీ చేస్తుండగా.. భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ అజిత్‌ పాల్‌ సింగ్‌ కూడా పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలోకి దిగనున్నారు. పొత్తులో భాగంగా కెప్టెన్‌కు వచ్చిన 37 సీట్లలో 26 స్థానాలు మాల్వా ప్రాంతంలోనివే. ఈ ప్రాంతంలో అమరీందర్‌ కుటుంబానికి గట్టి పట్టుంది. 2007 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంలో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషించింది. ఈసారి అమరీందర్‌ కాంగ్రెస్‌ను వీడటంతో ఈ ప్రాంతంలో హస్తం పార్టీకి గట్టి ఎదురుదెబ్బే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

117 నియోజకవర్గాలున్న పంజాబ్‌ అసెంబ్లీకి ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్నికలకు ముందే కెప్టెన్‌ రాజీనామా, అంతర్గత వివాదాలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. మరోవైపు ఇటీవల జరిగిన చండీగఢ్‌ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించి ఉత్సాహంగా ఉంది.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని