Uttarakhand: సీఎంగా పుష్కర్‌సింగ్‌ ప్రమాణం

ఉత్తరాఖండ్‌ 11వ ముఖ్యమంత్రిగా పుష్కర్‌ సింగ్‌ ధామీ (45) ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఉత్తరాఖండ్‌ రాజ్‌భవన్‌లో పుష్కర్‌సింగ్‌ చేత గవర్నర్‌ బేబీ రాణి మౌర్య ప్రమాణం చేయించారు....

Updated : 04 Jul 2021 19:32 IST

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ 11వ ముఖ్యమంత్రిగా పుష్కర్‌ సింగ్‌ ధామీ (45) ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఉత్తరాఖండ్‌ రాజ్‌భవన్‌లో పుష్కర్‌సింగ్‌తో గవర్నర్‌ బేబీ రాణి మౌర్య ప్రమాణం చేయించారు. సీఎంతోపాటు భాజపా ఎమ్మెల్యేలు సత్పాల్ మహారాజ్, హారక్ సింగ్ రావత్, బన్సీధర్ భగత్, యశ్‌పాల్ ఆర్య మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. పుష్కర్‌ సింగ్‌ ధామీ 2002-06 వరకూ భాజపా రాష్ట్ర జనతా యువ మోర్చాకు అధ్యక్షుడిగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్‌ కోశ్యారీకి, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు అత్యంత సన్నిహితుడు.

ఉత్తరాఖండ్‌లో గత నాలుగు నెలల్లో ముగ్గురు సీఎంలు మారారు. పార్టీలో అసమ్మతి సెగతో ఈ ఏడాది మార్చిలో త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత మార్చి 10న తీరథ్‌ సింగ్‌ రావత్‌ సీఎంగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన.. సీఎం పీఠంపై కొనసాగాలంటే సెప్టెంబరు 10లోపు అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది మార్చితోనే ముగియనుండటం, కొవిడ్‌ మహమ్మారి ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకపోవడంతో ఎన్నికల సంఘం ఉపఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా లేదు. మరోవైపు సీఎం అయ్యాక పలు వివాదాస్పద వ్యాఖ్యలతో భాజపా అధిష్ఠానానికి తీరథ్‌సింగ్‌ తలనొప్పులు తెచ్చిపెట్టారు. దీంతో సీఎంను మార్చేందుకే భాజపా మొగ్గుచూపింది. అయితే తీరథ్‌ విషయంలో ఎదురైన సమస్యల దృష్ట్యా.. ఈ సారి సిట్టింగ్‌ ఎమ్మెల్యేను తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఎమ్మెల్యే పుష్కర్‌ సింగ్‌ను తదుపరి సీఎంగా ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని