విభేదాలు పక్కన పెట్టండి.. విపక్షాలకు కమల్‌ హాసన్‌ పిలుపు

Kamal Haasan on new Parliament building: విభేదాలు పక్కనపెట్టి పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని విపక్షాలకు కమల్‌ హాసన్‌ పిలుపునిచ్చారు.

Published : 27 May 2023 17:21 IST

చెన్నై: పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని  (New Parliament building) విపక్షాలు బహిష్కరించడంపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) స్పందించారు. దేశ ఐక్యత కోసం ఒక్కరోజు విభేదాలు పక్కనపెట్టాలని పిలుపునిచ్చారు. బహిష్కరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరారు. అలాగే, ద్రౌపది మర్మును ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడానికి కారణమేంటంటూ ప్రధాని మోదీని సైతం ప్రశ్నించారు.

పార్లమెంట్‌ నూతన భవనం అనేది దేశ ఐక్యతకు సంబంధించిన కార్యక్రమం అని కమల్‌ హాసన్‌ అన్నారు. కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు కుటుంబ సభ్యులంతా హాజరు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఏవైనా విభేదాలు ఉంటే పబ్లిక్‌ ఫోరంలోనో, ఉభయ సభల్లోనో లేవనెత్తాలని సూచించారు. దేశంతో పాటు ప్రపంచ మొత్తం ఆసక్తిగా తిలకిస్తున్న ఈ వేడుక కోసం రాజకీయ పార్టీలు తమ విభేదాలను పక్కనపెట్టాలని సూచించారు.

పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కమల్‌ హాసన్‌ చారిత్రకఘట్టంగా అభివర్ణించారు. భారత ప్రభుత్వానికి తన అభినందనలు తెలియజేశారు. పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడంపై అసంతృప్తి ఉన్నప్పటికీ.. జాతి ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవ పండగలో భాగస్వామ్యం అవుతున్నట్లు పేర్కొన్నారు. అయినా రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదని ప్రధాని మోదీని ప్రశ్నించారు. పార్లమెంట్‌ పాస్‌ చేసే బిల్లులు రాష్ట్రపతి ఆమోదంతోనే చట్టాలు అవుతాయని, పార్లమెంట్‌ ఉభయ సభలను సమావేశ పరచడం, నిరవధికంగా వాయిదా వేయడం వంటి అధికారాలన్నీ రాష్ట్రపతి వద్దే ఉంటాయని గుర్తుచేశారు. కాబట్టి రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని ప్రధాని మోదీని కమల్‌ హాసన్‌ కోరారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు