
రాష్ట్రపతిని కలిసిన రఘురామకృష్ణరాజు
దిల్లీ: అమరావతిని పరిపాలనా రాజధానిగా కొనసాగించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కోరినట్టు నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ లాంటి న్యాయ కోవిదుల సలహా తీసుకుని రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై ఏపీ గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సూచించాలని రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు. పార్లమెంట్‌లో తెలుగు భాషపై మాట్లాడినందుకు తనకు వైకాపా నోటీసు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘నా పైన మా ప్రభుత్వానికి కోపం వచ్చింది. నాపై దాడికి మా ప్రభుత్వమే ఉసిగొల్పుతోంది. వైకాపా నేతలు పార్టీకి, ప్రభుత్వానికి తేడాను గమనించడం లేదు. ఎమ్మెల్యేలు, కార్యకర్తల నుంచి ముప్పు ఉందన్న విషయాన్ని రాష్ట్రపతికి తెలిపాను. ప్రజల డబ్బుతో రాజధాని కడుతున్నారు.. ఎవరూ భయపడవద్దు. తప్పు జరిగితే ప్రశ్నించండి. అమరావతి కోసం అందరం కష్టపడదాం. రైతులకు న్యాయం చేద్దాం. కులాలకు అతీతంగా మనం ముందుకు వెళ్ళాలి. రాజధానిలో అన్ని కులాల వారు భూములు ఇచ్చారు. వైసీపీ పార్టీ పై ఎవరైనా బురద జల్లితే తుడిచే పనిలో నేనున్నాను.’’ అని రఘురామకృష్ణరాజు మీడియాతో తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన పూర్తి సమాచారం రాష్ట్రపతి దగ్గర ఉందని, రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాని ఆయన చెప్పారు.
అనంతరం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తోనూ రఘురామకృష్ణరాజు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తనపై పత్రికల్లో వస్తున్న వార్తలను చూసి బాగోగులు అడిగారని ఎంపీ తెలిపారు. అంతేకాకుండా తన భద్రత అంశంపై మంత్రితో చర్చించానని చెప్పారు. త్వరలో మరికొంత మంది మంత్రులను కూడా కలుస్తానని ఎంపీ పేర్కొన్నారు.