‘ఇక్కడ జోడో.. అక్కడ టోడో’.. రాహుల్‌పై హిమంత విసుర్లు!

Himanta Biswa Sarma on Rahul gandhi: కాంగ్రెస్‌ నేత రాహుల్‌పై అస్సాం సీఎం హిమంత విమర్శలు గుప్పించారు. భారత్‌ను విదేశీ గడ్డపై అవమానిస్తున్నారని దుయ్యబట్టారు.

Published : 14 Mar 2023 01:32 IST

గంగావతి: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul gandhi) ఇటీవల బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలపై భాజపా నేతల నుంచి విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన విజయ్‌ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన రాహుల్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో భారత్‌ జోడో (భారత్‌ ఏకం) పేరిట యాత్ర చేసి.. అక్కడకు (లండన్‌) వెళ్లి భారతో టోడో (భారత్‌ను విభజించు) అంటున్నారని హిమంత ఎద్దేవా చేశారు.

‘‘ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా గానీ, లండన్‌ గానీ వెళితే మన దేశాన్ని కొనియాడుతారు. కానీ రాహుల్‌ బాబా (రాహుల్‌ గాంధీ) మాత్రం లండన్‌ వెళితే మన దేశాన్ని, మన పార్లమెంట్‌ను తిడతారు. కర్ణాటకలో భారత్‌ జోడో యాత్ర నిర్వహించిన రాహుల్‌.. లండన్‌ వెళ్లి ‘భారత్‌ టోడో’ అంటున్నారు. అసలు ఈ దేశాన్ని విభజించిందే మీ ముత్తాత కాదా? (నెహ్రూనుద్దేశించి)’’ అని హిమంత ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ జాడ కూడా ఎక్కడా కనిపించలేదని ఎద్దేవాచేశారు.

కర్ణాటకలో బసవరాజ్‌ బొమ్మై నేతృత్వంలోని భాజపా సర్కారు అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్నామని, గుజరాత్‌, ఈశాన్య రాష్ట్ర ప్రజలు ఆదరించినట్లే కర్ణాటకలో సైతం భాజపాను ఆదరించాలని ఓటర్లను కోరారు. మూడోసారి ప్రధాని మోదీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. కర్ణాటకతో పాటు కేంద్రంలో భాజపా గెలిస్తే మన దేశం విశ్వ గురువు అవుతుందన్నారు. త్రేతా యుగంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాల్సి హనుమంతుడు ఆ పనిచేసేవాడని, ఈ కలియుగంలో ఆ పనిని నరేంద్రమోదీ పూర్తి చేస్తున్నారని చెప్పారు. తన ప్రసంగంలో పలుమార్లు రాముడు, హనుమంతుడి ప్రస్తావన తీసుకురావడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు