Rahul disqualification: రాహుల్‌పై అనర్హత.. భాజపా సెల్ఫ్‌ గోల్‌: శశిథరూర్‌

Shashi Tharoor on Rahul disqualification: రాహుల్‌ గాంధీ అనర్హత వేటు వేయడం ద్వారా భాజపా సెల్ఫ్‌ గోల్‌ వేసుకుందని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ అన్నారు. ఈ ఘటనతో విపక్షాలన్నీ ఏకమయ్యాయని పేర్కొన్నారు.

Published : 25 Mar 2023 15:50 IST

తిరువనంతపురం: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై (Rahul disqualification) అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన భారతీయ జనతా పార్టీ (BJP) సెల్ఫ్‌గోల్‌గా అభివర్ణించారు. రాహుల్‌ అనర్హత విషయంలో లోక్‌సభ సచివాలయం గంటల వ్యవధిలో నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టిన ఆయన.. ఈ ఒక్క ఘటన విపక్షాలు ఏకమవ్వడానికి కారణమైందన్నారు. ఇది రాహుల్‌ గాంధీకి సైతం మేలు చేయనుందని చెప్పారు. దీని పరిణామాలు భాజపా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక అంశాలు లేవనెత్తారు.

‘‘రాహుల్‌ గాంధీ విషయంలో ఏం జరిగిందనేది ఇప్పుడు అన్ని చోట్లా హెడ్‌లైన్స్‌గా మారింది. ప్రపంచంలో అన్ని దేశాలు దీని గురించి చర్చించుకుంటున్నాయి. అలాగే, ఎప్పుడూ అంటీముట్టనట్లు ఉండే విపక్షాలన్నీ ఈ ఒక్క ఉదంతంతో ఏకం అయ్యాయి. తమ తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలు సైతం రాహుల్‌పై అనర్హత వేటు వేయడాన్ని ముక్త కంఠంతో ఖండించాయి’’ అని శశి థరూర్‌ అన్నారు. తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు గడువు ఉన్నా.. ఆగమేఘాలపై లోక్‌సభ సెక్రటేరియట్‌ అనర్హత వేటు వేయడాన్ని శశిథరూర్‌ తప్పుబట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని