Rahul Gandhi: తెలంగాణను వదిలి వెళ్లాలంటే చాలా బాధగా ఉంది: రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో ముగిసింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం మేనూర్‌ వద్ద నిర్వహించిన ముగింపు సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు.

Updated : 07 Nov 2022 20:01 IST


మద్నూర్‌: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో ముగిసింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం మేనూర్‌ వద్ద నిర్వహించిన ముగింపు సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు.

‘‘భారత్‌ జోడో యాత్ర.. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సాగుతోంది. యాత్రలో భాగంగా గత 10 రోజులుగా తెలంగాణలో పర్యటించాను. ఇవాళ తెలంగాణ నుంచి మహారాష్ట్రలో యాత్ర ప్రవేశిస్తుంది. తెలంగాణలో ఎంతో మంది ప్రజలతో మాట్లాడాను.. వారి కష్టసుఖాలు తెలుసుకున్నాను. ఈ రాష్ట్ర ప్రజలను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అయితే, వదిలి వెళ్లాలంటే చాలా బాధగా ఉంది. ఇక్కడి కాంగ్రెస్‌ కార్యకర్తల పనితీరు ఎంతో గొప్పగా ఉంది. ఇవేమీ మీడియాలో కనిపించవు.. టీవీలో రావు.. పార్టీ కార్యకర్తల పనితీరును నేను స్వయంగా చూశాను. మీ అద్భుత పనితీరుకు నా ధన్యవాదాలు.

గతంలోనూ తెలంగాణకు రావడం.. సమావేశాలకు హాజరవడం.. తిరిగి వెళ్లిపోవడం.. ఇలా జరిగేది. కానీ, ఈసారి నేను, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొని ప్రజలతో కలిసి ప్రయాణం చేశాం. ఎన్నో వర్గాల ప్రజలకు కలిశాం. నేను నడుస్తుంటే ఎన్నో విషయాలు గమనించాను. ఈ రాష్ట్ర ప్రజలుకంటున్న కలలను తెరాస ప్రభుత్వం కాలరాస్తోంది. ఆదివాసీలు, గిరిజనుల కోసం యూపీఏ ప్రభుత్వం ఎంతో చేసింది. కానీ, ఈ ప్రభుత్వం అంతా లాగేసుకుంటోంది. ఒక మాట స్పష్టంగా చెప్పగలను. తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకి వస్తేనే ఎవరి భూములు వారికి దక్కుతాయి. అది జరగకుండా ఏ శక్తి అడ్డుకోలేదు. యాత్రలో భాగంగా రైతులతో మాట్లాడాను. సంతోషంగా ఉన్నానని ఒక్క రైతు కూడా నాతో చెప్పలేదు. తెలంగాణలో కలిసిన రైతుల్లో ఒక్కరికి కూడా వ్యవసాయం లాభసాటిగా లేదు. హింస, ద్వేషం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నేను భారత్‌ జోడో యాత్రను ప్రారంభించాను. లక్షల మంది ప్రజలు యాత్రను కొనసాగించేందుకు కావాల్సిన శక్తి ఇచ్చారు. ఈ యాత్రలో భాగంగా నేను ఎంతో నేర్చుకున్నాను. తెలంగాణలో చేసిన పాదయాత్రను నేను ఎప్పుడూ మర్చిపోను’’ అని రాహుల్‌ గాంధీ అన్నారు.

త్యాగాలు చేసిన కుటుంబం.. అవినీతికి పాల్పడుతుందా?: రేవంత్‌

‘‘అన్ని వర్గాలకు తెరాస, భాజపా అన్యాయం చేశాయి. జెండాలు ఎవరు కట్టారు? రాజ్యం ఎవరు ఏలుతున్నారు? జాతిని, దేశాన్ని అంతమొందించేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారు. పదేపదే గాంధీ కుటుంబంపై దాడులు చేస్తున్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం.. అవినీతికి పాల్పడుతుందా? సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ దేశానికే ఆదర్శంగా జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు దేవుడి ముందు కూడా చెప్పుకోలేని సమస్యలు.. భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీకి చెప్పుకున్నారు. మోదీ, కేసీఆర్‌.. గాలిలో తిరుగుతూ గాలి మాటలు చెప్తున్నారు. రాహుల్‌ గాంధీ ప్రధాని అయితేనే దేశంలో సమస్యలు తగ్గుతాయి’’ అని రేవంత్‌ అన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు