Sanjay Raut: రాహుల్‌ ప్రధానికాగల సమర్థుడు.. సంజయ్‌ రౌత్‌ ప్రశంసలు

Sanjay Raut on Rahul gandhi: రాహుల్‌ గాంధీకి ప్రధానికాగల సమర్థత ఉందని సంజయ్‌ రౌత్‌ ప్రశంసించారు. దేశంపై ప్రేమ, సంకల్పం ఉన్నవాళ్లే ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయగలరని భారత్‌ జోడో యాత్రనుద్దేశించి అన్నారు.

Published : 22 Jan 2023 01:09 IST

జమ్మూ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై (Rahul Gandhi) ఉద్ధవ్‌ వర్గానికి చెందిన శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) ప్రశంసలు గుప్పించారు. దేశానికి ప్రధాని కాగల సమర్థుడు అని కొనియాడారు. కాంగ్రెస్‌ లేకుండా మూడో ఫ్రంట్‌ విఫల ప్రయోగమే అవుతుందని చెప్పారు. జమ్మూకశ్మీర్లో కొనసాగుతున్న ‘భారత్‌ జోడో యాత్ర’లో (Bharat Jodo Yatra) శుక్రవారం రౌత్‌ పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి 13 కిలోమీటర్ల పాటు నడక సాగించారు. ఈ నేపథ్యంలో శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.

ప్రజల్లో ఉన్న ద్వేషాన్ని, భయాలను పారదొలేందుకే రాహుల్‌ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు యాత్ర చేపట్టారని సంజయ్‌ రౌత్‌ అన్నారు. అంతే తప్ప కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రతిపక్షాలను ఏకం చేయడానికి కాదన్నారు. సైద్ధాంతిక, రాజకీయ వైరుధ్యాలను పక్కనపెడితే.. గాంధీలోని నాయకత్వ లక్షణాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు సవాలుగా మారనున్నాయని అన్నారు. ఆ ఎన్నికల్లో రాహుల్‌ అద్భుతం చేయబోతున్నారని జోస్యం చెప్పారు.

రాహుల్‌ గురించి భాజపా విపరీతమైన అసత్య ప్రచారం చేసిందని, ఒక్క యాత్రతో అపోహలన్నీ పటాపంచలయ్యాయని రౌత్‌ అన్నారు. ఈ సందర్భంగా రౌత్‌ను విలేకరులు ప్రశ్నించారు. దేశ ప్రధాని అయ్యే సమర్థత రాహుల్‌ గాంధీకి ఉందా అని అడగ్గా.. ‘ఎందుకు కాలేరు?’ అంటూ సమాధానం ఇచ్చారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 3,500 కిలోమీటర్ల దూరం నడవడం అందరి వల్లా కాదని రౌత్‌ అన్నారు. దానికి దృఢ సంకల్పం, దేశంపై ప్రేమ అవసరమన్నారు. ఆ రెండూ రాహుల్‌ గాంధీలో కనిపించాయన్నారు. ఈ యాత్రలో తనకు ఎక్కడా రాజకీయం కనిపించలేదని చెప్పారు. స్వతహాగా రాహుల్‌కు ప్రధాని కావడం ఇష్టం లేదని, ప్రజలు కోరుకుంటే మాత్రం పదవిని అలంకరిస్తారన్నారు.

కాంగ్రెస్‌ లేకుండా భాజపాను ఓడించేందుకు మూడో ఫ్రంట్‌ ఏర్పాటుపైనా ఈ సందర్భంగా రౌత్‌ స్పందించారు. దేశం నలుమూలలా కాంగ్రెస్‌ పార్టీ ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ లేకుండా మూడో ఫ్రంట్‌ ఏర్పాటు విజయవంతం కాలేదన్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్‌కు తక్కువ మంది ఎంపీలే ఉన్నప్పటికీ.. 2024 నాటికి పరిస్థితి మారబోతోందని చెప్పారు. తమ పార్టీ నేత ఆదేశాల మేరకే భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కశ్మీర్‌ పరిస్థితుల్లో ఇప్పటికీ పెద్దగా మార్పులేవీ రాలేదని రౌత్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని