Rahul Gandhi: అది క్యాబినెట్‌ కాదు.. పరివార్‌ మండల్‌

కేంద్ర మంత్రిమండలి పూర్తిగా ‘పరివార్‌ మండల్‌’ (కుటుంబ మండలి)గా కనిపిస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు.

Published : 12 Jun 2024 06:44 IST

మంత్రిమండలిలో అనేకమంది రాజకీయ వారసులే
మోదీ మాటలకు, చేతలకు పొంతన ఉండదు: రాహుల్‌

దిల్లీ: కేంద్ర మంత్రిమండలి పూర్తిగా ‘పరివార్‌ మండల్‌’ (కుటుంబ మండలి)గా కనిపిస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. మోదీ 3.0 సర్కారు క్యాబినెట్‌లో చాలామంది రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారేనని చెప్పారు. ‘తరతరాలుగా పోరాటాలు, సేవలు, త్యాగాలను చేసినవారిని వంశపారంపర్య రాజకీయాలు చేస్తున్నవారిగా విమర్శించినవారే ఇప్పుడు అధికారాన్ని తమ సర్కారీ పరివార్‌కు పంచుతున్నారు. మాటలకు, చేతలకు మధ్య వ్యత్యాసాన్నే నరేంద్రమోదీ అంటారు’ అని ‘ఎక్స్‌’ వేదికగా వాగ్బాణాలు వేశారు. మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవెగౌడ తనయుడు కుమారస్వామి, కేంద్ర మాజీ మంత్రి మాధవరావు సింధియా తనయుడు జ్యోతిరాదిత్య సింధియా, అరుణాచల్‌ప్రదేశ్‌ తొలి ప్రోటెం స్పీకర్‌ రించిన్‌ ఖరు కుమారుడు కిరణ్‌ రిజిజు, మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్‌నాథ్‌ ఖడ్సే కోడలు రక్షా ఖడ్సే, మాజీ ప్రధాని చౌధరి చరణ్‌సింగ్‌ మనవడు జయంత్‌ చౌధరి, కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్‌ పాస్వాన్‌ తనయుడు చిరాగ్‌ పాస్వాన్, మాజీ ఎంపీ జయశ్రీ బెనర్జీ అల్లుడు జె.పి.నడ్డా, బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్‌ కుమారుడు రామ్‌నాథ్‌ ఠాకుర్, కేంద్ర మాజీమంత్రి కె.ఎర్రన్నాయుడి కుమారుడు రామ్మోహన్‌ నాయుడు, హరియాణా మాజీ ముఖ్యమంత్రి రావ్‌ బీరేంద్రసింగ్‌ కుమారుడు రావ్‌ ఇంద్రజీత్‌ సింగ్, కేంద్ర మాజీ మంత్రి వేద్‌ప్రకాశ్‌ గోయల్‌ తనయుడు పీయూష్‌ గోయల్‌లతో పాటు రవ్‌నీత్‌సింగ్‌ బిట్టూ, అనుప్రియా పటేల్, కీర్తివర్ధన్‌సింగ్‌ల పేర్లను రాహుల్‌ ప్రస్తావించారు. 

ప్రియాంక వారణాసిలో పోటీచేస్తే మోదీ ఓడిపోయేవారు 

రాయ్‌బరేలీ: తన సోదరి ప్రియాంకా గాంధీ గానీ వారణాసి నుంచి లోక్‌సభకు పోటీచేసి ఉంటే ప్రధాని మోదీ కనీసం 2-3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయేవారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పారు. రాయ్‌బరేలీ, అమేఠీ ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పేందుకు మంగళవారం రాయ్‌బరేలీలో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ సామాన్య ప్రజల కోసం తామంతా పాటుపడతామని తెలిపారు. ‘ఇప్పుడు మనపై పెద్ద బాధ్యత ఉంది. విపక్షంగా మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. కార్యకర్తలు,  నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎట్టిపరిస్థితుల్లో అహంకారం దరిచేరనివ్వొద్దు. మనమధ్య కుటుంబ బంధం ఉందని గుర్తుంచుకోండి. నేను రాయ్‌బరేలీకి ఎంపీనైనా ఇక్కడ జరిగేదంతా అమేఠీలోనూ జరుగుతుంది’ అని రాహుల్‌ చెప్పారు. ప్రియాంక మాట్లాడుతూ- రెండు నియోజకవర్గాల్లో పార్టీ విజయం చరిత్రాత్మకంగా నిలిచిపోతుందన్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు ఐక్యంగా, మనస్ఫూర్తిగా పనిచేయడం వల్ల యూపీలో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని