Rahul Gandhi: ఎటూ తేల్చుకోలేకపోతున్నా

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తాను గెలుపొందిన వయనాడ్‌ (కేరళ), రాయ్‌బరేలీ (యూపీ) లోక్‌సభ నియోజకవర్గాల్లో దేనిని వదులుకోవాలనే దానిపై అయోమయంలో ఉన్నారు.

Updated : 13 Jun 2024 06:39 IST

వయనాడ్, రాయ్‌బరేలీల్లో దేన్ని వదులుకోవాలనే విషయంపై రాహుల్‌ 

మలప్పురం, తిరువనంతపురం : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తాను గెలుపొందిన వయనాడ్‌ (కేరళ), రాయ్‌బరేలీ (యూపీ) లోక్‌సభ నియోజకవర్గాల్లో దేనిని వదులుకోవాలనే దానిపై అయోమయంలో ఉన్నారు. ఈ విషయంపై రాహుల్‌ బుధవారం స్పందిస్తూ తాను ఎటువైపు మొగ్గాలో తేల్చుకోలేకపోతున్నట్లు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం అనంతరం తొలిసారి ఆయన కేరళను సందర్శించారు. మల్లప్పురం జిల్లాలో ఎడవన్నా, వయనాడ్‌ జిల్లాలో కల్పెట్టాలో జరిగిన సభల్లో మాట్లాడుతూ వయనాడ్‌ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘‘నేను ఏ నియోజకవర్గాన్ని వదులుకోవాలనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏమైనా కానీ.. వయనాడ్‌ లేదా రాయ్‌బరేలీలో ఒక దానికే నేను ఎంపీగా ఉండాలి. నా నిర్ణయంతో రెండు నియోజకవర్గాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని వ్యాఖ్యానించారు. 

మోదీ నైతిక బాధ్యత వహించాలి

ఈ సందర్భంగా ప్రధాని మోదీ తీరును రాహుల్‌ గాంధీ తప్పుబట్టారు. దేశంలో విమానాశ్రయాలు, విద్యుత్‌ కర్మాగారాలను పారిశ్రామికవేత్త అదానీకి అప్పగించాలని దేవుడు ఆదేశించారా? అని ఎద్దేవా చేశారు. తాను మాత్రం మానవమాత్రుడినేనని తెలిపారు. తనకు పేదలు, దేశమే దైవమని చెప్పారు. తాను ఏం చేయాలో వారే చెబుతారన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మోదీ తన వైఖరిని మార్చుకోవాల్సిందేనన్నారు. ఈ మేరకు ప్రజలు ఆయనకు స్పష్టమైన సందేశం పంపారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సీట్లు భాజపా ఒంటరిగా సాధించలేకపోవడానికి మోదీ నైతిక బాధ్యత వహించాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు ముందు రాజ్యాంగాన్ని మారుస్తామని భాజపా నేతలు మాట్లాడారని, కానీ అదే రాజ్యాంగానికి ప్రమాణస్వీకారం వేళ మోదీ దండం పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు వారికి ఏం కావాలో ప్రధానికి స్పష్టంగా తెలిసేలా చేశారన్నారు. 

వయనాడ్‌ను వదులుకుంటారా?

వయనాడ్‌ లోక్‌సభ స్థానాన్ని రాహుల్‌ గాంధీ వదులుకునే అవకాశం ఉందని కేపీసీసీ అధ్యక్షుడు కె.సుధాకరన్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. దేశానికి నాయకత్వం వహించాల్సిన రాహుల్‌ వయనాడ్‌లో ఎంపీగా కొనసాగుతారని తాము భావించడంలేదని, ఆయన ఈ స్థానాన్ని వదులుకున్నా బాధపడబోమని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని