Rahul Gandhi: మమ్మల్ని అంతం చేసే కుట్రే..! రాహుల్‌కు శిక్షపై ప్రతిపక్షాల మండిపాటు

ఓ పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి శిక్షపడటంపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. తమను అంతం చేసే కుట్ర జరుగుతోందంటూ మండిపడ్డాయి.

Published : 23 Mar 2023 14:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ పరువునష్టం కేసులో కాంగ్రెస్‌(Congress) నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)కి గుజరాత్‌తోని సూరత్‌ కోర్టు(Surat Court) రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో భాజపా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. అధికార యంత్రాంగం రాహుల్‌ గాంధీ గొంతు నొక్కేందుకు యత్నిస్తోందని పార్టీ సీనియర్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi) ఆరోపించారు. ‘నా సోదరుడు ఎప్పుడూ భయపడలేదు. నిజాలే మాట్లాడారు. ఇకముందు కూడా అలాగే ఉంటారు. దేశప్రజల కోసం గొంతెత్తుతారు’ అని పేర్కొన్నారు. నియంతృత్వ భాజపా ప్రభుత్వానికి సంబంధించిన చీకటి కోణాలను బయటపెడుతున్నందునే.. రాహుల్‌ గాంధీతోపాటు ప్రతిపక్షాలను అణచివేస్తున్నట్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ఆరోపించారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో అప్పీలు చేస్తామని వెల్లడించారు.

‘కాంగ్రెస్‌తో విబేధాలు ఉన్నాయి.. కానీ’

ప్రతిపక్షాలను అంతం చేసే కుట్ర జరుగుతోందంటూ ఆప్‌ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ వ్యవహారంపై స్పందించారు. ‘ప్రతిపక్ష నేతలను, పార్టీలను అంతం చేసే కుట్ర జరుగుతోంది. కాంగ్రెస్‌తో మాకు విభేదాలు ఉన్నాయి. అయితే, ఈ కేసులో రాహుల్‌ను ఇలా ఇరికించడం సరికాదు. న్యాయస్థానాన్ని గౌరవిస్తా.. కానీ, తీర్పుతో ఏకీభవించను’ అని కేజ్రీవాల్ ట్వీట్‌ చేశారు. మీడియాను అణచివేసి, న్యాయవ్యవస్థను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘెల్‌ ఆరోపించారు. ‘న్యాయవ్యవస్థ, ఈడీ వంటి వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్నాయి. అందుకే, మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆరోపిస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు(రాహుల్‌ వ్యాఖ్యలు) సాధారణమే. రాహుల్ ధైర్యవంతుడు, ఆయనొక్కరే ఎన్డీఏ ప్రభుత్వంతో పోటీపడగలరు’ అని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోన్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని