Bharat Jodo Yatra: జోడో యాత్ర నాలో తెచ్చిన మార్పిదే: రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న భారత్‌ జోడో యాత్ర ఆదివారానికి 2,000 కి.మీ పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు యాత్ర తనలో తీసుకొచ్చిన పలు మార్పులను ఆయన సోమవారం మీడియాతో ముఖాముఖిలో వెల్లడించారు. 

Published : 29 Nov 2022 18:04 IST

ఇందోర్‌: ప్రస్తుతం తాను కొనసాగిస్తున్న భారత్‌ జోడో యాత్ర వల్ల తనలో చాలా మార్పు వచ్చినట్లు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఓర్పు, సహనం పెరిగాయని తెలిపారు. అలాగే ఇతరులు చెప్పేది వినే సామర్థ్యం కూడా మెరుగైందన్నారు. సెప్టెంబరు 7న తమళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్ర ఆదివారం నాటికి 2000 కి.మీ పూర్తిచేసుకొని ఇందోర్‌కు చేరుకుంది.

యాత్రలో మీకు అత్యంత సంతృప్తినిచ్చిన అంశం ఏంటి? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘చాలా ఉన్నాయి. ఈ యాత్ర వల్ల నాలో సహనం చాలా పెరిగింది. ఇప్పుడు ఎవరైనా తోసినా.. లాగినా.. ఎనిమిది గంటలైనా నాకు అసలు చిరాకు రావడం లేదు. గతంలో రెండు గంటల్లోనే చిరాకొచ్చేది. యాత్రలో నడుస్తున్నప్పుడు నొప్పొస్తే భరించాల్సిందే. మధ్యలో నిష్క్రమించలేం. అలాగే ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఏదైనా చెబితే సావధానంగా వింటున్నాను. ఈ మార్పులన్నీ నాకు చాలా ఉపయోగపడతాయని భావిస్తున్నాను’’ అని రాహుల్‌ గాంధీ అన్నారు.

గతంలో అయిన ఓ గాయం వల్ల యాత్ర ప్రారంభించిన తొలిరోజుల్లో మోకాళ్లలో నొప్పి వచ్చినట్లు రాహుల్‌ తెలిపారు. దానివల్ల చాలా ఇబ్బందిపడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆ స్థితిలో అసలు యాత్రను పూర్తి చేయగలుగుతానా.. లేదా.. అనే అనుమానం కూడా కలిగిందన్నారు. కానీ, క్రమంగా దాన్ని అధిగమించగలిగానని తెలిపారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల్లో జరిగిన ఓ సంఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు. ‘‘యాత్రలో పాల్గొన్నవారు తరచూ తోస్తుండడంతో ఓ సందర్భంలో చాలా నొప్పిని అనుభవించాను. ఆ సమయంలో ఓ చిన్నపాప వచ్చి నాతో నడవడం ప్రారంభించింది. నాకు ఓ లేఖ కూడా ఇచ్చింది. పాప వెళ్లిపోయిన తర్వాత దాన్ని చదివాను. ‘మీరు ఒంటరిగా నడుస్తున్నానని అనుకోవద్దు. నేనూ మీతో పాటే ఉన్నాను. నా తల్లిదండ్రులు అనుమతించకపోవడం వల్ల యాత్ర ఆసాంతం నేను మీతో నడవలేకపోతున్నాను. కానీ, నేను మీతోనే ఉంటాను’ అని లేఖలో ఉంది’’ అని రాహుల్‌ తెలిపారు. ఇలాంటి ఘటనలు తనలో ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని