Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ నియమితులు కానున్నారు. ఆయనను నియమించాలని కోరుతూ  ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌కు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ మంగళవారం సాయంత్రం లేఖ రాశారు.

Published : 26 Jun 2024 04:19 IST

ప్రొటెం స్పీకర్‌కు లేఖ ద్వారా తెలిపిన సోనియా
తండ్రి, తల్లి తర్వాత ఆ బాధ్యతల్లో..

ఈనాడు, దిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ నియమితులు కానున్నారు. ఆయనను నియమించాలని కోరుతూ  ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌కు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ మంగళవారం సాయంత్రం లేఖ రాశారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా కూటమి నేతల భేటీలో రాహుల్‌ను విపక్ష నేతగా ఎన్నుకొన్నారు. అనంతరం సోనియా లేఖ పంపారు. రాహుల్‌ గాంధీ ఎన్నికను  కూటమి సమావేశంలో ఆమోదించామని, ఆ తర్వాత సోనియా లేఖ రాశారని, మిగిలిన నియామకాలను తర్వాత చేపడతామని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు.

పదేళ్ల తర్వాత..

రాహుల్‌ గాంధీ ఇప్పటిదాకా ఐదు సార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు. వయనాడ్‌లోనూ గెలిచినా దానిని వదులుకున్నారు. మంగళవారం ఎంపీగా ఆయన లోక్‌సభలో రాజ్యాంగం చేతబట్టి ప్రమాణం చేశారు. కాంగ్రెస్‌కు పదేళ్ల తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. 2014, 2019లలో మొత్తం సీట్లలో 10శాతం దక్కించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం రాలేదు. ఈసారి 99 సీట్లను గెలుచుకోవడంతో ఆ హోదా దక్కింది. 2004లో అధికారంలోకి రావడానికి ముందు సోనియాగాంధీ 4 ఏళ్ల 98 రోజులపాటు ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్‌ కూటమి అధికారంలో కొనసాగింది. 

1969 వరకూ ప్రతిపక్ష నేతకు ఎలాంటి గుర్తింపు, హోదా, ప్రత్యేకాధికారాలు ఉండేవి కావు. పార్లమెంటులో ప్రతిపక్ష నేత జీతభత్యాల చట్టం-1977 ద్వారా ప్రత్యేక గుర్తింపునివ్వడం మొదలుపెట్టారు. 1989 డిసెంబరు 18 నుంచి 1990 డిసెంబరు 23వరకూ రాజీవ్‌ గాంధీ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. దీంతో ప్రతిపక్ష నేతలుగా పని చేసిన ప్రత్యేక రికార్డు రాహుల్‌ గాంధీతోపాటు, ఆయన తండ్రి, తల్లికి దక్కినట్లయింది. 7, 8 లోక్‌సభలతోపాటు, 16, 17 లోక్‌సభల్లో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేతలెవరూ లేరు. ఇప్పుడు 18వ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ వ్యవహరించనున్నారు. 

1970 జూన్‌ 19న జన్మించిన రాహుల్‌ గాంధీ 2004 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2004, 2009, 2014లలో అమేఠీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. 2019లో అమేఠీ, వయనాడ్‌ నుంచి పోటీ చేశారు. అమేఠీలో ఓడిపోయి వయనాడ్‌లో గెలిచారు. 2024లో రాయ్‌బరేలీ, వయనాడ్‌ల నుంచి పోటీ చేసి రెండు చోట్లా విజయం సాధించారు. వయనాడ్‌కు రాజీనామా చేసి ప్రస్తుతం తన తాత, నానమ్మ, అమ్మ ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ నియోజకవర్గానికి ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. 2008 నుంచి 2013 వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2013 నుంచి 2016 వరకు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా, 2017 నుంచి 2019 వరకు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ పని చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు