Prashant Kishor: పీకే ఒప్పుకోడని రాహుల్‌ గాంధీకి ముందే తెలుసా..?

కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ నిరాకరించారు. తన చేరిక కంటే.. ప్రస్తుతం కాంగ్రెస్‌కు నాయకత్వం, సమష్టి సంకల్పం ఎక్కువ అవసరమంటూ ఇటీవల ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

Updated : 28 Apr 2022 10:44 IST

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ నిరాకరించారు. తన చేరిక కంటే.. ప్రస్తుతం కాంగ్రెస్‌కు నాయకత్వం, సమష్టి సంకల్పం ఎక్కువగా అవసరమంటూ ఇటీవల ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అయితే, హస్తం పార్టీలో చేరేందుకు పీకే ఒప్పుకోడని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ముందే ఊహించారట. ఈ మేరకు పార్టీ వర్గాలు తాజాగా వెల్లడించాయి.

‘‘పీకే కాంగ్రెస్‌లో చేరడని రాహుల్ గాంధీ తొలిరోజే చెప్పేశారు. పార్టీలోకి రావాలని ప్రశాంత్‌ కిశోర్‌ను ఆహ్వానించడం ఇదేం తొలిసారి కాదు. ఈ విషయమై కాంగ్రెస్‌, పీకే మధ్య దాదాపు ఎనిమిది సార్లు చర్చలు జరిగాయి. ఇటీవల కూడా పీకేనే స్వయంగా వచ్చి కాంగ్రెస్‌ నేతలతో సమావేశం అవ్వాలని అడిగారు. పార్టీ పునరుద్ధరణ కోసం ఓ ప్రజెంటేషన్‌ ఇస్తానని చెప్పారు. ఆయన గురించి తెలిసి రాహుల్‌ గాంధీ దానిపై ఆసక్తి చూపించకపోవడంతో ప్రియాంక గాంధీ వాద్రా అపాయింట్‌మెంట్‌ కావాలని పీకే కోరారు’’ అని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌ పెద్దలతో పీకే ఇటీవల పలుమార్లు సమావేశమయ్యారు. అయితే, ఈ భేటీలకు రాహుల్‌ గాంధీ హాజరుకాకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాహుల్‌ విదేశీ పర్యటనలో ఉన్నట్లు పార్టీ వెల్లడించింది.

కాంగ్రెస్‌ పార్టీలో చేరి సాధికారిక కార్యాచరణ బృందంలో సభ్యుడిగా ఉండాలంటూ అధిష్ఠానం పీకేకు ఆహ్వానం అందించింది. అయితే, అందుకు ఆయన తిరస్కరించారు. పార్టీ పునర్‌వ్యవస్థీకరణ కోసం తాను రూపొందించిన ప్రణాళికల అమలుకు అవసరమైన స్వేచ్ఛను, కీలక పదవిని ఇచ్చేందుకు నాయకత్వం ససేమిరా అనడంతో ప్రశాంత్‌ కిశోర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే  ప్రధానంగా తెరాసతో ఐప్యాక్‌ ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందం ఈ పరిణామాలకు దారితీసినట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీని ఉపయోగించుకుని ఇతర పార్టీలకు లాభం చేకూర్చాలని పీకే భావిస్తున్నారంటూ కొందరు హస్తం పార్టీ సీనియర్‌ నేతలు ఆరోపణలు కూడా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని