Assam CM: రాహుల్‌ గాంధీ.. మీరు సద్దాం హుస్సేన్‌లా మారిపోతున్నారు..!

భారత్‌ జోడో యాత్ర పేరుతో పలు రాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తున్న రాహుల్‌ గాంధీ సద్దాం హుస్సేన్‌ మాదిరిగా మారిపోతున్నారని భాజపా నేత, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది.

Published : 24 Nov 2022 02:01 IST

అహ్మదాబాద్‌: ‘భారత్‌ జోడో యాత్ర’ పేరుతో పాదయాత్ర చేస్తోన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై భాజపా నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఇరాక్‌ మాజీ నియంత సద్దాం హుస్సేన్‌ మాదిరిగా కనిపిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అన్నారు. సర్దార్‌ పటేల్‌, జవహార్‌లాల్‌ నెహ్రూ లేదా మహాత్మా గాంధీ మాదిరిగా తయారైతే బాగుండేదని వ్యాఖ్యానించారు. సీఎం హిమంత చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్‌.. భాజపా నేతలు అల్పబుద్ధితో ప్రచారానికి దిగుతున్నారని విమర్శించింది.

గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్‌ సభలో పాల్గొన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ రాహుల్‌ గురించి ప్రస్తావించారు. ‘ఇటీవల రాహుల్‌ గాంధీ రూపురేఖలు మారిపోయాయి. అయితే, ఇందులో ఎటువంటి తప్పులేదని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఒకవేళ రూపురేఖలు మార్చుకోవాలంటే కనీసం సర్దార్‌ పటేల్‌ మాదిరిగానో లేదా జవహార్‌లాల్‌ నెహ్రూ లాగా మార్చుకుంటే ఉత్తమం. గాంధీజీ మాదిరిగా ఉంటే ఇంకా మంచిది. కానీ, సద్దాం హుస్సేన్‌ లాగా ఎందుకు మార్చుకుంటున్నారు..? ఎందుకంటే.. కాంగ్రెస్‌ సంప్రదాయం అనేది భారత ప్రజలకు తగినట్లుగా ఉండదు. భారత్‌ను ఎన్నడూ అర్థం చేసుకోని వారికి దగ్గరగా ఉంటుంది’ అని రాహుల్‌ గాంధీని ఉద్దేశిస్తూ అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు.

‘భారత్‌ జోడో యాత్రలో భాగంగా ఇటీవల ఎన్నికలు జరిగిన హిమాచల్‌ ప్రదేశ్‌తోపాటు ఎన్నికలు జరుగుతోన్న గుజరాత్‌లో పర్యటించేందుకు రాహుల్‌ గాంధీ సుముఖత చూపలేదు. ఎన్నికలు లేని రాష్ట్రాలపైనే ఆయన దృష్టి సారించారు. ఎందుకంటే ఆయన ఎక్కడ పర్యటిస్తే అక్కడ ఓటమి తప్పదని ఆయనకు తెలుసు’ అని విమర్శించారు. ఇక నర్మదా బచావో ఉద్యమం చేపట్టిన మేధా పాట్కర్‌ వంటి నాయకులతో రాహుల్‌ గాంధీ కలిసి నడవడాన్ని చూశానని.. అటువంటి వారు గుజరాత్‌ అభివృద్ధిని ఎన్నడూ కోరుకోరని అన్నారు.

అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత మనీశ్‌ తివారీ స్పందించారు. ‘ఇటువంటి తీవ్ర దూషణలపై స్పందించడం నాకు ఇష్టం లేదు. బహిరంగంగా మాట్లాడేటప్పుడు భాషను సరిగ్గా ఉపయోగించడం ఎంతో ముఖ్యం. అస్సాం ముఖ్యమంత్రి మాత్రం ఇటువంటి అల్పబుద్ధి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం’ అని మనీశ్‌ తివారీ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని