BJP: ప్రధాని మోదీపై రాహుల్ ఆరోపణలు నిరాధారం, సిగ్గుచేటు: రవిశంకర్‌ ప్రసాద్‌

అదానీ గ్రూపు వ్యవహారంలో ప్రధాని మోదీ(PM Modi)ని ఉద్దేశిస్తూ లోక్‌లోసభలో రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) చేసిన ఆరోపణల్ని భాజపా ఖండించింది. దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే అనేక భారీ కుంభకోణాల్లో కాంగ్రెస్‌ ప్రమేయం ఉందంటూ కౌంటర్‌ ఇచ్చింది.

Published : 08 Feb 2023 01:33 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ (Adani Groupi) వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul gandhi) చేసిన ఆరోపణలపై భాజపా(BJP) తీవ్రంగా స్పందించింది. ప్రధానితో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే గౌతమ్‌ అదానీ(gautam adani) అతి తక్కువ కాలంలో ప్రపంచ కుబేరుడయ్యారని.. ఆయన కోసం ఏకంగా రూల్స్‌నే మార్చేశారంటూ రాహుల్‌ చేసిన పలు ఆరోపణలు నిరాధారం.. సిగ్గుచేటని భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే అనేక భారీ కుంభకోణాల్లో కాంగ్రెస్‌ ప్రమేయం ఉందంటూ దుయ్యబట్టారు. పార్లమెంట్‌ బయట విలేకర్లతో మాట్లాడిన రవిశంకర్‌ ప్రసాద్‌.. నేషనల్‌ హెరాల్డ్‌, ఆగస్టా వెస్ట్‌లాండ్‌ కుంభకోణాలను ప్రస్తావిస్తూ గాంధీల కుటుంబంపై విరుచుకుపడ్డారు. గత కాంగ్రెస్‌ పాలనలో అవినీతిపై రాహుల్ గాంధీ ప్రశ్నించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. రాహుల్, ఆయన తల్లి సోనియా గాంధీ, బావ రాబర్ట్‌ వాద్రా బెయిల్‌పై ఉన్నారన్నారు. అవినీతి, అవినీతిని కాపాడటం అనేవి కాంగ్రెస్‌కు రెండు స్తంభాలని.. ఆ రెండింటినీ కాపాడటమే రాహుల్‌, ఆయన కుటుంబం చరిత్ర అంటూ ధ్వజమెత్తారు. 

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో మాట్లాడిన సందర్భంగా రాహుల్‌ గాంధీ రాహుల్‌ ప్రసంగిస్తున్న సమయంలో అధికార పక్షం నుంచి పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దంటూ కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు రాహుల్‌కు సూచించారు. ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. తన ప్రసంగం మధ్యలో అదానీతో మోదీ సంబంధాలకు సంబంధించిన ఫొటోలను లోక్‌సభలో రాహుల్‌ గాంధీ ప్రదర్శించగా.. స్పీకర్‌ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇలా పోస్టర్లు ప్రదర్శించడం సరికాదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని