లాభాలు ప్రైవేటుపరం.. నష్టాలు జాతీయం..!

ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరణ దిశగా నిర్ణయాలు తీసుకుంటోదని.. లాభాలు వచ్చే సంస్థలను ప్రైవేటుకు అప్పగిస్తోన్న కేంద్ర ప్రభుత్వం, నష్టాలను మాత్రం జాతీయం చేస్తున్నట్లు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.

Updated : 17 Mar 2021 12:08 IST

కేంద్రం తీరుపై రాహుల్‌ గాంధీ విమర్శ

దిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా నిర్ణయాలు తీసుకుంటోందని కేంద్రంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. లాభాలు వచ్చే సంస్థలను ప్రైవేటుకు అప్పగిస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. నష్టాలను మాత్రం జాతీయం చేస్తోందని విమర్శించారు. ‘కేంద్ర ప్రభుత్వం లాభాలను ప్రైవేటు పరం, నష్టాలను జాతీయం చేస్తోంది. భారత ఆర్థికవ్యవస్థ భద్రత విషయంలో రాజీపడుతోన్న ప్రభుత్వం, ప్రభుత్వరంగ బ్యాంకులను మోదీ మిత్రులకు విక్రయించే ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా సమ్మెచేస్తోన్న బ్యాంకు ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతున్నాను’ అని రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

రెండో రోజు కొనసాగుతోన్న సమ్మె..

బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మె రెండోరోజు కొనసాగుతోంది. తొలిరోజు జరిగిన సమ్మెలో అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండోరోజు కూడా ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సమ్మెలో వివిధ సంఘాలకు చెందిన 9లక్షల మంది ఉద్యోగులు పాల్గొన్నట్లు నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ వెల్లడించింది. బ్యాంకు ఉద్యోగులు చేస్తోన్న ఈ రెండురోజుల సమ్మెకు కాంగ్రెస్‌తో పాటు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోకపోతే రైతుల ఆందోళన తరహాలోనే తమ సమ్మెను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని