
Rahul Gandhi: సమాచారం లేదని పరిహారం ఇవ్వరా? ఇదిగో ఆ జాబితా: రాహుల్
దిల్లీ: సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో మృతిచెందిన రైతుల సమాచారం తమ వద్ద లేదంటూ ఇటీవల లోక్‌సభలో కేంద్రం ఇచ్చిన సమాధానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. నెలల తరబడి కొనసాగిన ఈ పోరాటంలో దాదాపు 700 మందికిపైగా రైతులు చనిపోయారన్నారు. సమాచారం లేదని చెప్పి ఆ రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడం మానేస్తారా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. పరిహారం ఇవ్వడం ఇష్టంలేకే కేంద్రం అబద్ధాలాడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం సాయంత్రం ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోరాటంలో అమరులైన అన్నదాతల జాబితా పంజాబ్ ప్రభుత్వం వద్ద ఉందని.. దాన్ని కేంద్రం తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్లే 700 మంది రైతులు చనిపోయారని, ఆ కుటుంబాలను ఆదుకొనే బాధ్యత కేంద్రానిదేనన్నారు.
ఒక్క పంజాబ్ ప్రభుత్వమే 403 మంది రైతుల్ని గుర్తించిందని రాహుల్ తెలిపారు. పంజాబ్ కాకుండా మిగతా ప్రాంతాలకు చెందిన 100మంది రైతుల జాబితా తమ పార్టీ వద్ద ఉందనీ.. మరో 200 మంది జాబితా పబ్లిక్ రికార్డ్స్‌లో ఉన్నట్టు వివరించారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేయడానికి మించి రైతుల డిమాండ్లను మోదీ సర్కార్ అంగీకరిస్తుందని తాను అనుకోవడంలేదనీ.. కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగాలేదన్నారు. రైతుల ఆందోళనలకు పంజాబ్ ప్రభుత్వం బాధ్యత లేకపోయినప్పటికీ ఈ పోరాటంలో మృతిచెందిన 403 మంది కర్షకుల కుటుంబాలకు ₹5లక్షల చొప్పున పరిహారం అందించిందన్నారు. అలాగే, 152 మంది రైతుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చిందని, మిగతా వారికి కొలువులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఈ వివరాలన్నీ ప్రజా బాహుళ్యంలోనే ఉన్నట్టు తెలిపారు. తమ వద్ద ఉన్న జాబితాను సోమవారం పార్లమెంట్ సెషన్‌లో పెట్టనున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం వద్ద వివరాలు లేకపోయినా.. ‘ఇదిగో మా వద్ద పేర్లు, నంబర్లు, అడ్రస్‌లు ఉన్నాయి’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. సాగుచట్టాల విషయంలో ప్రధాని తప్పును అంగీకరించి బహిరంగ క్షమాపణలు కోరినా.. పోరాటంలో మరణించిన రైతులకు పరిహారం ఇవ్వడానికి సమస్యేంటి అని రాహుల్ ప్రశ్నించారు.
► Read latest National - International News and Telugu News