Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం: రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు కర్ణాటక ఎన్నికల (Karnataka Elections 2023) ప్రచారంలో కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన మొదటి రోజే ఆ హామీని నెరవేరుస్తామని ప్రకటించారు. 

Published : 28 Apr 2023 01:28 IST

ఉడుపి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections 2023) ప్రచారంలో ఓటర్లపై కాంగ్రెస్‌ (Congress) పార్టీ వరాల జల్లులు కురిపిస్తోంది. తాజాగా ఉడిపి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మహిళలందరికీ ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. 

‘‘కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చదని ప్రధాని మోదీ అంటున్నారు. ఇప్పటి వరకు మేం నాలుగు హామీలు ఇచ్చాం. ఇప్పడు వాటికి మరో హామీని కలుపుతున్నా. ఇది మహిళల కోసం. అధికారం చేపట్టిన మొదటి రోజే ఈ ఐదో హామీని నెరవేరుస్తాం. కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే.. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ’’ అని రాహుల్ గాంధీ తెలిపారు. 

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్నభాగ్య, యువనిధి పేరుతో నాలుగు హామీలను ఇచ్చింది. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల కరెంటు ఉచితంగా అందిస్తామని తెలిపింది. గృహ లక్ష్మీలో భాగంగా మహిళలకు ₹ 2,000 ఆర్థిక సాయం ప్రకటించింది. అన్నభాగ్య పథకం ద్వారా దారిద్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 10 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తామని వెల్లడించింది. యువనిధిలో భాగంగా 18 నుంచి 25 ఏళ్లున్న డిప్లొమా చదువుకున్న యువతకు ₹ 1,500, డిగ్రీ చదువుకున్న యువతకు ₹ 3,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని