Rahul Gandhi: పారదర్శకత.. లేదా రద్దు

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎంల) పనితీరుపై అనుమానాలు రేకెత్తుతున్నవేళ వాటిపైనా, ఎన్నికల ప్రక్రియపైనా పూర్తి పారదర్శకత సాధించేలా చూడాలని, లేనిపక్షంలో వాటిని రద్దు చేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు.

Updated : 18 Jun 2024 07:23 IST

ఈవీఎంలపై రాహుల్‌ డిమాండ్‌
మస్క్‌ వ్యాఖ్యలపై కొనసాగుతున్న రగడ

దిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎంల) పనితీరుపై అనుమానాలు రేకెత్తుతున్నవేళ వాటిపైనా, ఎన్నికల ప్రక్రియపైనా పూర్తి పారదర్శకత సాధించేలా చూడాలని, లేనిపక్షంలో వాటిని రద్దు చేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు. ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఈవీఎంలు బ్లాక్‌బాక్సులవంటివని, వాటిని పరిశీలించేందుకు ఎవరికీ అవకాశం ఉండదని వ్యాఖ్యానించిన ఆయన సోమవారం ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ‘‘పారదర్శక ఎన్నికల ప్రక్రియలే ప్రజలకు తగిన రక్షణ కల్పించగలవు. ఈవీఎంలు తిరుగులేనివని చెప్పేముందు.. ఈసారి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎన్ని యంత్రాల్లో సమస్యలు తలెత్తాయన్న గణాంకాలను ఈసీ బయటపెట్టాలని కాంగ్రెస్‌ నేత, జొర్హాట్‌ నుంచి ఎన్నికైన లోక్‌సభ సభ్యుడు గౌరవ్‌ గొగొయ్‌ డిమాండ్‌ చేశారు. ‘నమోదైన ఓట్లు, తేదీ, సమయాలను ఎన్ని యంత్రాలు తప్పుగా చూపించాయి? నమూనా పోలింగ్‌లో ఎన్నింట్లో తప్పులు కనిపించాయి? ఎన్ని యంత్రాలకు అనుసంధానమైన కౌంటింగ్‌ యూనిట్‌.. బ్యాలెట్‌ యూనిట్‌లను మార్చారు? అనేవి ఈసీ వెల్లడించాలి. ఇవి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. యంత్రాలు తప్పులు చూపిస్తున్నాయని ఈ ఎన్నికల్లో పోటీచేసిన ఒక అభ్యర్థిగా నేను కచ్చితంగా చెప్పగలను’ అని ఎక్స్‌లో తెలిపారు. 

‘టెస్లా కార్లనూ హ్యాక్‌ చేయొచ్చేమో’ 

‘క్యాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్‌ టోస్టర్లను మనం హ్యాక్‌ చేయలేం. ఈవీఎంలు కూడా అలాంటివే. అవి ఫలితాన్ని భద్రపరుస్తాయి. ప్రపంచంలో సురక్షితమైన ఎలక్ట్రానిక్, డిజిటల్‌ పరికరమేదీ ఉండదు. టెస్లా కారునూ హ్యాక్‌ చేయొచ్చని ఎవరైనా చెప్పొచ్చు’  అని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. ఈవీఎం వ్యవస్థలో మతలబులకు అవకాశం ఉందని కాంగ్రెస్‌ నేత శాం పిట్రోడా అన్నారు. ‘‘ఎలక్ట్రానిక్స్, టెలికం, ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో 60 ఏళ్లు పనిచేశాను. ఈవీఎంలను అధ్యయనం చేశాను. ఫలితాన్ని మార్చేందుకు అవకాశం ఉందనుకుంటున్నా. బ్యాలెట్‌ పత్రాల విధానం మెరుగైంది’’ అంటూ ఎక్స్‌ వేదికగా అభిప్రాయపడ్డారు.


అక్కడి ఫలితంపై కోర్టుకెళ్తాం: శివసేన (యూబీటీ) 

వాయవ్య ముంబయి నియోజకవర్గంలో 48 ఓట్ల తేడాతో తేలిన ఫలితంపై న్యాయపోరాటం చేస్తామని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే వెల్లడించారు. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి తమ అభ్యర్థి నుంచి విజయాన్ని లాక్కొన్నారని విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఎన్నికల్లో అవకతవకలపై ఒకటిరెండు రోజుల్లో కోర్టుకు వెళ్తామని తెలిపారు. ఈసీ అంటే ‘ఎంటైర్లీ కాంప్రమైజ్డ్‌ కమిషన్‌’ (పూర్తిగా రాజీపడ్డ సంఘం) అని అభివర్ణించారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే భాజపా 40 సీట్లు దాటేది కాదన్నారు. వాయవ్య ముంబయి విజేత రవీంద్ర వైకర్‌ను ప్రమాణం చేయనివ్వకుండా అడ్డుకోవాలని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలపై సుప్రీంకోర్టు, ఈసీ తగిన నిర్ణయం తీసుకోవాలని ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ అభిప్రాయపడ్డారు. 80 స్థానాల్లో తగిన రీతిలో లెక్కింపు జరిగితే ప్రస్తుత ప్రభుత్వం కూలిపోతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని