Rahul gandhi: తనోదియాలో రాహుల్‌కు వినూత్న స్వాగతం.. పూలబుట్ట అందించిన శునకాలు

మధ్యప్రదేశ్‌లోని అగర్‌మాల్వా జిల్లాలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీకి వినూత్న స్వాగతం లభించింది.

Updated : 03 Dec 2022 09:49 IST

కాంగ్రెస్‌ నేతకు పూలబుట్ట అందించిన శునకాలు

తనోదియా: మధ్యప్రదేశ్‌లోని అగర్‌మాల్వా జిల్లాలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీకి వినూత్న స్వాగతం లభించింది. పాదయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం తనోదియా పట్టణానికి చేరుకున్న ఆయన తేనీటి కోసం స్వల్ప విరామం తీసుకున్నారు. ఆ సమయంలో రెండు లాబ్రడార్‌ జాతి శునకాలు ఎదురుగా వచ్చి పూల బుట్టను అందజేసి సాదర స్వాగతం పలికాయి. అనంతరం రాహుల్‌...వాటితో ఫొటోలు దిగారు. లిజో, రెగ్జీ అని పిలుచుకునే ఆ శునకాలకు ఇందోర్‌కు చెందిన సర్వమిత్ర నాచన్‌ యజమాని. రాహుల్‌ పాదయాత్రలో తన ప్రత్యేకతను చాటుకోవడం కోసం ఆరేళ్ల వయసున్న ఆ కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. తనోదియా పట్టణానికి వచ్చి వినూత్న స్వాగతం పలికినట్లు చెప్పారు. మధ్యప్రదేశ్‌లో రాహుల్‌ పాదయాత్ర శుక్రవారం పదో రోజుకు చేరుకుంది.

శ్రీరాముడి జీవన విధానాన్ని అనుసరించని భాజపా, ఆరెస్సెస్‌: రాహుల్‌

మహాత్మాగాంధీ నిత్యం స్మరించే ‘హేరామ్‌’.. ఒక జీవన విధానమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తెలిపారు. యావత్తు ప్రపంచానికి అది ప్రేమ, సోదరభావం, గౌరవం, తపస్సు గురించి బోధిస్తుందని వివరించారు. అయితే, జైరామ్‌ అని నినదించే భాజపా, ఆరెస్సెస్‌ నేతలు...శ్రీరాముడి జీవన విధానాన్ని, ఆదర్శాలను పాటించడంలేదని విమర్శించారు. ‘జైసీతారామ్‌’ అంటే సీత, రాముడు ఒక్కటేనని అర్థమన్నారు. సీత గౌరవం కోసం రాముడు యుద్ధం చేశారని తెలిపారు. భాజపా, ఆరెస్సెస్‌ నేతలు మహిళల గౌరవం కోసం కృషి చేయడంలేదని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని