Modi - Rahul: కాంగ్రెస్‌ ర్యాలీ వాయిదా..ఒకేరోజు మోదీ, రాహుల్‌ మీటింగ్స్‌

వివాదాస్పద వ్యాఖ్యల కేసులో జైలుశిక్ష పడి లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కోలార్‌లో సత్యమేవజయతే పేరిట ర్యాలీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్‌ 9కి వాయిదా వేస్తూ ఆపార్టీ నిర్ణయం తీసుకుంది. అదేరోజు ప్రధాని మోదీ మైసూరులో పర్యటించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Published : 01 Apr 2023 16:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ పార్టీల ప్రచార జోరు మరింత వేడెక్కింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒకే రోజు.. అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఇటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఏప్రిల్‌ 9న వీరిద్దరూ కర్ణాటకలో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించనున్నారు.

2019లో కోలార్‌(Kolar) ఎన్నికల ప్రచారంలో మోదీ ఇంటిపేరుతో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇటీవల గుజరాత్‌ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలుశిక్ష విధించడం, ఆ తర్వాత ఆయనపై అనర్హత వేటు పడటం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాల సమయంలోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ రావడంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో త్వరలో ప్రచారం చేపట్టనున్నారు. అయితే గతంలో ఎక్కడ అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో.. అదే కోలార్‌ నుంచి ఈసారి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు ఇటీవల పార్టీ వెల్లడించింది.  ‘సత్యమేవ జయతే’ పేరుతో కోలార్‌లో ఈ ర్యాలీని ఏప్రిల్‌ 5న జరపాలని నిర్ణయించింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వాయిదా వేశారు. ఏప్రిల్‌ 9న నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు.

కాగా.. ఏప్రిల్‌ 9న మైసూరు(Mysuru)లో మోదీ పర్యటించనున్నారు. ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’  స్వర్ణోత్సవాలకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. దీంతో  కాంగ్రెస్‌ పార్టీ అదే రోజు సత్యమేవ జయతే  ర్యాలీ చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, కాంగ్రెస్‌ ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని