Rahul Gandhi: నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నా : రాహుల్‌ గాంధీ

Updated : 12 Jun 2024 16:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఓ అంశంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఆయన ఈసారి పోటీచేసిన వయనాడ్‌ (కేరళ), రాయ్‌బరేలీ (యూపీ)లో ప్రజలు ఆయన్ను మంచి మెజార్టీతో గెలిపించారు. దీంతో ఆయన ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈవిషయంపై రాహుల్‌ బుధవారం స్పందించారు. తాను ఎటువైపు మొగ్గాలో తేల్చుకోలేకపోతున్నట్లు వెల్లడించారు. ఏ నిర్ణయం తీసుకొన్నా రెండు నియోజకవర్గాలు సంతోషంగా అంగీకరిస్తాయన్నారు. ఆయన కేరళలోని మల్లప్పురంలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, వయనాడు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

‘‘నేను ఓ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏమైనా కానీ.. వయనాడ్‌ లేదా రాయ్‌బరేలీలో ఒక దానికే నేను ఎంపీగా ఉండాలి. నా నిర్ణయంతో రెండు నియోజకవర్గాలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని వ్యాఖ్యానించారు.  ఈసందర్భంగా ప్రధాని మోదీ తీరును తప్పుపట్టారు. దేశంలో విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు అదానీకి అప్పగించాలని దేవుడు ఆదేశించారా అని ఎద్దేవా చేశారు. తాను మాత్రం మానవమాత్రుడినేనని తెలిపారు. తనకు పేదలు, దేశమే దైవమని చెప్పారు. తాను ఏం చేయాలో వారే చెబుతారన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మోదీ తన వైఖరిని మార్చుకోవాల్సిందేనన్నారు. ఈమేరకు ప్రజలు ఆయనకు స్పష్టమైన సందేశం పంపారని వ్యాఖ్యానించారు. 

సార్వత్రిక ఎన్నికల్లో విజయం అనంతరం తొలిసారి ఆయన కేరళను సందర్శించారు. ఈ రాష్ట్రం నుంచి రెండోసారి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల ప్రచార సమయంలో తాను రాజ్యాంగ రక్షణకు పోరాడుతున్నట్లు రాహుల్‌ వెల్లడించారు. ఏదోఒక నియోజకవర్గాన్ని వదులుకొనే అంశంపై శనివారం దిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో తన అభిప్రాయాన్ని పార్టీ అధిష్ఠానానికి రాహుల్‌ తెలిపినట్లు తెలుస్తోంది. దీనిపై జూన్‌ 17న అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. 2019 ఎన్నికల్లో యూపీలోని అమేఠీ స్థానంలో కేంద్ర మంత్రి స్మృతిఇరానీ చేతిలో ఓడిపోయిన రాహుల్‌.. కేరళలోని వయనాడ్‌ నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో వయనాడ్‌తోపాటు రాయ్‌బరేలీలోను రాహుల్‌ పోటీ చేశారు. అమేఠీ, రాయ్‌బరేలీల్లో కాంగ్రెస్‌ గెలుపొంది తన కంచుకోటలను కాపాడుకుంది. రాహుల్‌ ఇప్పుడొక అంశంపై తీవ్రంగా ఆలోచిస్తున్నారు. మంచి మెజార్టీతో గెలిపించిన రెండు నియోజకవర్గాల్లో దేనిని వదులుకోవాలో తేల్చుకోలేకపోతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని